ఎంజీ వర్సిటీ నామ్‌‌కే వాస్తే

ఎంజీ వర్సిటీ నామ్‌‌కే వాస్తే
  • సగం మందే ప్రొఫెసర్లు 
  • అకడమిక్​ కన్సల్టెంట్లతోనే టీచింగ్‌‌
  • కొరవడిన పర్యవేక్షణ
  • వసతుల లేమితో న్యాక్​ గుర్తింపునకు ఎసరు
  • సర్కారు నుంచి నిధుల్లేవ్.. యూజీసీ నుంచీ రావు

నల్లగొండ, వెలుగు:  రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల్లో ఒకటైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ నామ్‌కే వాస్తే మాదిరి తయారైంది. నిధులు రాక, వసతుల్లేక, స్టూడెంట్లకు క్లాసులు చెప్పేందుకు ఫ్యాకల్టీ లేక కొట్టుమిట్టాడుతోంది. వర్సిటీని ఏర్పాటు చేసి పన్నెండేళ్లవుతున్నా ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. సిబ్బంది నియామకాల ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వచ్చిన న్యాక్​ గుర్తింపు కూడా.. తర్వాత కోల్పోయింది.

17 కోర్సులు.. రెండు వేల స్టూడెంట్స్..

యూనివర్సిటీలో 17 కోర్సులు నిర్వహిస్తున్నారు. ఏటా రెండు వేల మంది స్టూడెంట్లు అడ్మిషన్లు తీసుకుంటారు. కానీ అందుకు సరిపడా టీచింగ్‌‌ ఫ్యాకల్టీ లేకపోవడంతో అకడమిక్​ కన్సల్టెంట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. వర్సిటీలో ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 70 పోస్టులు మంజూరు చేశారు. దీంట్లో రెగ్యులర్​అధ్యాపకుల సంఖ్య కేవలం 35 మందే. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిబంధనల మేరకు ఒక్కో కోర్సుకు కనీసం ఏడుగురు టీచింగ్‌‌ ఫ్యాకల్టీ అవసరం కాగా.. ఇప్పుడు ముగ్గురు,నలుగురితోనే వెళ్లదీస్తున్నారు. ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్, ఆర్గానిక్​ కెమిస్ట్రీ, సోషల్​వర్క్​ తదితర కోర్సులకు రెగ్యులర్​ప్రొఫెసర్లు లేక.. అకడమిక్​ కన్సల్టెంట్లతో క్లాసులు నిర్వహిస్తున్నారు.

ఇంజనీరింగ్‌‌లో అంతా ఖాళీయే!

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్​ కోర్సుల నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. ఒక్కో బ్రాంచిలో కనీసం తొమ్మిది మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉండగా.. అన్ని బ్రాంచిలకు కలిపి 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు. బోధనేతర సిబ్బంది వంద మందికిగాను కేవలం ఆరుగురు మాత్రమే రెగ్యులర్​ఉద్యోగులు ఉన్నారు. బోధనేతర సిబ్బందిలో ప్రధానంగా అసిస్టెంట్​ రిజిస్ట్రార్లు, జూనియర్​ అసిస్టెంట్లు, ల్యాబ్​ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్లు, అటెండర్లు, డ్రైవర్లను ప్రభుత్వం నియమించాల్సిఉంది.

యూజీసీ నుంచీ సాయం లేక..

మహాత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ (నేషనల్​ అక్రిడిటేషన్​ కౌన్సిల్, అసెస్​మెంట్) గుర్తింపు 2016లోనే లభించింది. ఈ గుర్తింపు ఉండటంతో యూజీసీ నుంచి నిధులు వస్తాయి. మౌలిక వసతులు, సదుపాయాల ఆధారంగా ఈ వర్సిటీకి న్యాక్​ 2.32 గ్రేడింగ్​ఇచ్చింది. యూజీసీ నుంచి రూ.20 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారు. కానీ ఆ సొమ్ము విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఆ లోగా న్యాక్​ నిబంధనలు మారిపోయాయి. 2.5 గ్రేడ్, ఆపైన గ్రేడింగ్​ఉంటేనే యూనివర్సిటీలకు నిధులిస్తామని రూల్స్​వచ్చాయి. దీంతో మంజూరైన నిధులు కూడా ఆగిపోయాయి. ఐదేళ్లకోసారి ఇచ్చే న్యాక్​ గుర్తింపు తిరిగి పొందాలంటే యూనివర్సిటీలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, లేకుంటే యూజీసీ నుంచి నిధులు వచ్చే పరిస్థితి ఉండదని అధికారులు చెప్తున్నారు.

నిధుల కేటాయింపులే.. రిలీజ్​ ఏదీ?

రాష్ట్ర ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి నిధులే రావడం లేదు. ఏటా బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నా కాగితాలకే పరిమితమయ్యాయి. 2017–-18కిగాను రూ.40 కోట్లు, 2018-–19కిగాను రూ.44.49 కోట్లను బడ్జెట్లలో కేటాయించారు. కానీ సర్కారు నుంచి నామమాత్రంగానే నిధులు విడుదలయ్యాయి. ఆ నిధులు వస్తాయన్న నమ్మకంతో వర్సిటీలో పలు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. లైబ్రరీ భవనం విస్తరణ, అదనపు హాస్టల్​ భవనాలు, వీసీ రెసిడెన్సీ, స్టాఫ్​ క్వార్టర్స్​ పనులు చేపట్టారు. నిధుల్లేక ఆ పనులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు.

అసలు డిపార్ట్​మెంట్లే లేవు…

యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ, బీఈడీ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలను పర్యవేక్షించేందుకు, అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వర్సిటీలో వాటికి సంబంధించిన డిపార్ట్​మెంట్లు ఉండాలి. అయితే వర్సిటీలో జువాలజీ, బాటనీ డిపార్ట్​మెంట్లను ఏర్పాటు చేయలేదు. ఆ సబ్జెక్టుల విషయంలో డిగ్రీ కాలేజీలకు ఎలాంటి సహకారం అందని పరిస్థితి నెలకొంది. ఇక సోషల్​ సబ్జెక్టులకు సంబంధించి.. ఎకనామిక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్​ ఒక్కటే ఉంది. పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, పొలిటికల్​ సైన్స్​ డిపార్ట్‌‌మెంట్లను ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 30 బీఈడీ కాలేజీలు ఉండగా.. వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్​ డిపార్ట్‌‌మెంట్​ లేదు.

ఫ్యాకల్టీ నియామకాల్లో అక్రమాలు

యూనివర్సిటీలో గతంలో 31 మంది రెగ్యులర్‌‌ ఫ్యాకల్టీ నియామకాల్లో అక్రమాలు జరిగాయి. అధికారుల కమిటీ దీన్ని నిర్ధారించింది. అయినా వారిపై చర్యలు తీసుకోలేదు. హాస్టల్‌‌లో సమస్యలను పట్టించుకునేవారు లేరు. చాలా డిపార్ట్‌‌ మెంట్లలో క్లాసులు సరిగా జరగడం లేదు.

– డి.లింగస్వామి, ఎస్‌‌ఎఫ్‌‌ఐ ఎంజీయూ సెక్రెటరీ

తెలుగు, హిస్టరీ క్లాసులు స్టార్ట్‌‌ కాలే

వర్సిటీలోని ఆర్ట్స్‌‌ కాలేజీలో కొత్తగా మంజూరైన ఎంఏ తెలుగు, హిస్టరీ కోర్సులకు గదులు లేక ఇంతవరకు క్లాసులు ప్రారంభం కాలేదు. జిమ్‌‌ కూడా మూసివేశారు. హాస్టల్‌‌ దారిలో స్ట్రీట్‌‌ లైట్లు వెలగడం లేదు. బాయ్స్‌‌ హాస్టల్‌‌లో డ్రైనేజీ సమస్య ఉంది. ఎవరూ పట్టించుకోవట్లేదు.

– అల్లంపల్లి సతీష్,    వర్సిటీ ఎంఎస్‌‌ఎఫ్‌‌ ఇన్​చార్జి

ఎన్నో సమస్యలున్నయి

వర్సిటీలు మనుగడ సాగించాలంటే నిధుల కేటాయింపు తప్పనిసరి. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలి. ప్రమాణాలు కలిగిన ఉన్నత విద్య అందించాలంటే అన్ని రకాల సౌకర్యాలు, వనరులు ఉండాలి. టీచింగ్, నాన్​టీచింగ్ సిబ్బంది కొరత వల్ల విద్యాపరంగా, పరిపాలపన పరంగా అనేక సమస్యలు వస్తున్నాయి.

– కె.అంజిరెడ్డి, ఎకానమిక్స్ హెచ్ఓడీ