సీఏఏతో ఎవరికీ నష్టం లేదు: కేంద్రం

సీఏఏతో ఎవరికీ నష్టం లేదు: కేంద్రం
  •                 మరోసారి తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం
  •                 సుప్రీంకోర్టులో 129 పేజీల అఫిడవిట్​ దాఖలు

 

సిటిజన్​ షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ) ముమ్మాటికీ రాజ్యాంగబద్ధమైందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి తన స్టాండ్​ను స్పష్టం చేసింది. ఈ చట్టంతో దేశంలోని ఏ ఒక్కరికీ నష్టం ఉండబోదని తేల్చిచెప్పింది. ఏ ఒక్క ఇండియన్​ప్రాథమిక హక్కులకు సీఏఏ విఘాతం కలిగించబోదని తెలిపింది. దేశ ప్రజల లీగల్, డెమొక్రటిక్​, సెక్యులర్​ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేసింది. మతం కోణంలో దీన్ని చూడటం సరికాదని, మత హింసను ఎదుర్కొంటున్న శరణార్థుల అంశంగానే చూడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన అఫిడవిట్​లో కేంద్రం తేల్చిచెప్పింది. సీఏఏను వ్యతిరేకిస్తూ, దాని రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ  సుప్రీంకోర్టులో 140కి పైగా  పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు వివరణ కోరగా..  మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్​ బీసీ జోషి అఫిడవిట్​ దాఖలు చేశారు. 129 పేజీల అఫిడవిట్​లో కేంద్ర ప్రభుత్వం తన స్టాండ్​ను కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అసలు ఈ చట్టంతో దేశంలోని పౌరుల సిటిజన్​షిప్​కు సంబంధం ఏ మాత్రం లేదని తెలిపింది. సీఏఏతో ప్రభుత్వానికి ఎలాంటి అసాధారణ అధికారాలు దక్కవని కూడా స్పష్టం చేసింది.

ఆ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్లకే

మన పొరుగు దేశాలైన పాకిస్తాన్​, ఆఫ్గనిస్తాన్​, బంగ్లాదేశ్​లో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు మతపర హింసను ఎదుర్కొంటున్నారని, వారు శరణార్థులుగా వచ్చినందున వారికి సిటిజన్​షిప్​ కల్పించేందుకు ఈ చట్టాన్ని పార్లమెంట్​చేసిందని కేంద్రం తన అఫిడవిట్​లో  గుర్తుచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడే చట్టంలో సవరణలు చేసిందని వివరించింది. 2014 డిసెంబర్​ 31 ముందు పాకిస్తాన్​, బంగ్లాదేశ్​, అఫ్ఘనిస్తాన్​ నుంచి వచ్చినవారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏ మత స్వేచ్ఛకు  ఇది భంగం కలిగించబోదని తెలిపింది. ఆ మూడు దేశాల ముస్లింలకు దీన్ని వర్తింపజేయకపోవడం ఏమిటన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఆయా దేశాల్లోని మైనార్టీలకు మాత్రమే సీఏఏ వర్తిస్తుందని, మతపర హింసను ఎదుర్కొంటున్న వారి కోసమే రూపొందించిందని పేర్కొంది. సీఏఏకు నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజన్స్​ (ఎన్​ఆర్సీ)కి ముడిపెడుతూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ రెండింటికీ సంబంధమే లేదని తేల్చిచెప్పింది.