ఉత్తరాదిని వణికిస్తున్న చలి..స్కూళ్లకు వింటర్ సెలవులు

ఉత్తరాదిని వణికిస్తున్న చలి..స్కూళ్లకు వింటర్ సెలవులు

న్యూఢిల్లీ: ఉత్తరాదిని చలి వణికిస్తోంది. జమ్మూకాశ్మీర్ లో  టెంపరేచర్ మైనస్ డిగ్రీలలోకి పడిపోగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో చలి తీవ్రత పెరిగింది. మధ్యప్రదేశ్ లోని కొన్నిచోట్ల, మహారాష్ట్ర లోని విదర్భ, చత్తీస్ గఢ్, నార్త్ గుజరాత్, ఒడిశాలో చలిగాలులు వీస్తున్నాయని , ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని  వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూకాశ్మీర్ లోని  శ్రీనగర్ లో శనివారం రాత్రి టెంపరేచర్ మైనస్ 6.2 డిగ్రీలకు పడిపోయింది. కాశ్మీర్ లోయ, లడాఖ్ యూనియన్ టెరిటరీలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఫ్రీజింగ్ పాయింట్ కన్నా దిగువకు పడిపోయింది. జమ్మూ- శ్రీనగర్ నేషనల్ హైవేపై బనిహాల్ టౌన్ లో ఉష్ణోగ్రత మైనస్ 2.2 డిగ్రీలుగా రికార్డైంది. దోడా జిల్లా భదెర్వాలో మైనస్ 0.8 డిగ్రీల టెంపరేచర్  నమోదైంది. జమ్మూలో కనిష్ఠ ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలుగా రికార్డైనట్లు అధికారులు చెప్పారు. వైష్ణో దేవి యాత్రికులు బస చేసే (బేస్ క్యాంప్) కత్రాలో 3.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  లడాఖ్ లోని లేహ్ లో మైనస్ 19 డిగ్రీలు, ద్రాస్ పట్టణంలో మైనస్ 28.7 డిగ్రీలుగా నమోదైంది.

హర్యానాలో స్కూళ్లకు సెలవు

హర్యానా, పంజాబ్ లనూ చలి వణికిస్తోంది. చండీగఢ్ లో శనివారం రాత్రి ఈ సీజన్ లోనే అతి తక్కువగా 2.9 డిగ్రీల కనిష్ఠ టెంపరేచర్ నమోదైంది.  చలిగాలుల తీవ్రత వల్ల హర్యానాలో సోమ, మంగళవారాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. జనవరి 1 నుంచి 15 వరకు స్కూళ్లకు వింటర్ సెలవులను ప్రకటించారు. దేశ రాజధాని  ఢిల్లీలోనూ చలి  తీవ్రత పెరిగింది. పొగ మంచు వల్ల విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.