కోటి10 లక్షల మందికి బువ్వలేదు

కోటి10 లక్షల మందికి బువ్వలేదు

నార్త్‌‌ కొరియాలో దాదాపు కోటీ పది లక్షల మంది అంటే ఆ దేశ జనాభాలో దాదాపు 43 శాతం మంది తిండి లేక అలమటించిపోతున్నారు. లక్షలాది మంది పిల్లలు పోషకాహార లోపంతో చనిపోతున్నారని యూఎన్‌‌ లేటెస్ట్‌‌ రిపోర్ట్‌‌ ద్వారా వెల్లడైంది. నార్త్‌‌ కొరియా వ్యాప్తంగా ప్రజల్లో ఫుడ్‌ సెక్యూరిటీ, పోషకాహార లోపం ఎక్కువగా ఉందని ఆదేశంలో యూఎన్‌‌ ఆఫీస్‌‌ హెడ్‌ తపన్‌‌ మిశ్రా చెప్పారు. ఐదుగురు పిల్లల్లో ఒకరు పోషకాహారం అందక ఎదుగుదల లోపిస్తోందని, ఇది ఒక తరానికి పెద్ద దెబ్బే అని అభిప్రాయపడ్డారు. సరైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం, నీరు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడమే దీనికి కారణం. పోషకాహార లోపంతో బాధపడుతున్న 60 లక్షల మందికి సాయపడేందుకు 111 మిలియన్‌‌ డాలర్లు అవసరం కాగా, పోయిన ఏడాది కేవలం 24 శాతం నిధులు మాత్రమే వచ్చాయని మిశ్రా చెప్పారు. దాదాపు 30లక్షల మంది దుర్భర పరిస్థితుల్లో జీవితాలు గడుపుతున్నారని, వారిని కాపాడేందుకు 120 మిలియన్‌‌ డాలర్ల ఫండ్‌ అవసరమని యూఎన్‌‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌‌ డ్యుజారిక్‌ మీడియాతో చెప్పారు. నిధుల్లేక పోవడంతో యూఎన్‌‌ ఏజెన్సీలను మూసేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఈ ఏడాది దాదాపు 1.4 మిలియన్‌‌ టన్నుల ఆహార కొరత ఉంటుందని అంచనా వేసిన నార్త్‌‌ కొరియా ప్రభుత్వం దాన్ని ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయంగా దాతల సాయాన్ని కోరింది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఉపయోగించకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు లాంటి కారణాల వల్ల ఆ రంగంలో దిగుబడి తగ్గుతోంది. పోయిన ఏడాది తీవ్రమైన వేడి గాలులు, ఆగస్టు చివరలో వచ్చిన సోలిక్‌ తుపాను కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఐదేళ్ల వయసులోపు వారు లక్ష నలభైవేల మంది పోషకాహార లోపంతో ఉన్నారని, దీని వల్ల మరణాల సంఖ్య ఎక్కువ అవుతోందని నివేదిక వెల్లడించింది. న్యూక్లియర్‌‌‌‌ మిసైల్స్‌ ను ప్రయోగించినందుకుగాను ఉత్తరకొరియాపై యూఎన్‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆంక్షల్ని విధించింది. అయితే హ్యూమనిటేరియన్‌‌ సాయానికి మాత్రం ఈ నిబంధన మినహాయింపు ఉంది. అయినా సరైన బ్యాంకింగ్‌‌ ఛానల్‌ లేకపోవడం, నిధుల కొరత వల్ల అది విదేశాల నుంచి సాయం అందడంలేదు. 2017 సెప్టెంబరు నుంచి నార్త్‌‌ కొరియా బ్యాంకింగ్‌‌ ఛానల్‌ సస్పెండ్‌ అయిందని, ఆ సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని మిశ్రా చెప్పారు. అయితే హ్యూమనిటేరియన్‌‌ సాయానికి ఎలాంటి ఇబ్బందు ల్లేకుండా గత ఏడాది ఆగస్టులో యూఎన్‌‌ భద్రతా మండలి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. అయినప్పటికీ ఆయా దేశాలు అందించే సాయంలో జరుగుతున్న ఆలస్యం వల్ల ఆకలితో అలమటించే ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.