‘‘ఊపిరి ఆడడం లేదు.. ప్రాణం పోయేలా ఉంది’’ సెల్ఫీ పంపి చనిపోయిన ఘటనపై హైకోర్టు విచారణ

‘‘ఊపిరి ఆడడం లేదు.. ప్రాణం పోయేలా ఉంది’’ సెల్ఫీ పంపి చనిపోయిన ఘటనపై హైకోర్టు విచారణ

చెస్ట్ హాస్పిటల్  ఘటనపై హైకోర్టు ఆగ్రహం

మృతుడి ఆరోపణలకూ.. ఆస్పత్రి వాదనకు పొంతన లేదు

విచారణ వచ్చే నెల 2 వారానికి వాయిదా

హైదరాబాద్, వెలుగు: చెస్ట్‌ హాస్పిటల్ లో యువకుడి మరణంపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రిపోర్టు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఏ ఆధారాలు లేకుండా విచారణ ఎలా చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘నాకు ఆక్సిజన్‌ అందడం లేదు డాడీ.. ప్రాణం పోయేలా ఉంది డాడీ’ అని చనిపోయే ముందు యువకుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో సాక్ష్యంగా ఉందని తెలిపింది. యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలకు ఆదేశాలివ్వాలని బీజేవైఎం స్టేట్ వైస్‌ ప్రెసిడెంట్‌ బొల్గం యశ్ పాల్‌ గౌడ్‌ వేసిన పిల్ ను చీఫ్ జస్టిస్‌ ఆర్‌‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్ సేన్‌ రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ గురువారం రెండోసారి విచారించింది.

ఆక్సిజన్‌, మాస్క్​లు ఉన్నాయని, పూర్తి స్థాయిలో చికిత్స అందించామని చెబుతున్నారే తప్ప ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు సబ్మిట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రిపోర్టు ఇచ్చారని, డాక్టర్ల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ లాయర్‌‌ రాధీవ్‌ రెడ్డి కోర్టుకు తెలిపారు. మెడికల్‌ రికార్డులు లేకుండా రిపోర్టు ఎలా సబ్మిట్‌ చేస్తారని, అరకొర వివరాలతో కేసును విచారిం చలేమని బెంచ్‌ స్పష్టం చేసింది. నిజనిర్ధారణ కమిటీని నియమిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ వారానికి వాయిదా వేస్తూ.. మృతుడు రవికుమార్‌‌కు చెందిన మెడికల్‌ రికార్డును కోర్టుకు సబ్మిట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.