ఇంటర్ ఫెయిల్ అయినోళ్లను పాస్ చేసేందుకు అధికారుల కసరత్తు

ఇంటర్ ఫెయిల్ అయినోళ్లను పాస్ చేసేందుకు అధికారుల కసరత్తు
  • కండోనేషల్, కంపార్ట్ మెంటల్ విధానాలపై అధికారుల స్టడీ
  •  ఇతర బోర్డులతో ఇంటర్ ఆఫీసర్లతో సంప్రదింపులు

ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీఎగ్జామ్ ను రద్దు చేయాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకోవడంతో, ఫెయిల్ అయిన స్టూడెంట్లను ఎలా పాస్ చేయాలనే దానిపై ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఇంటర్నల్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర బోర్డుల్లో అనుసరిస్తున్న విధానాలతో పాటు ఏపీలో అమలు తీరునూ తెలుసుకుంటున్నారు.

అందరూ పాస్?

రాష్ర్టంలో 9,66,062 మంది ఇంటర్ ఎగ్జామ్స్ రాయగా.. 5,95,063 మంది పాసయ్యారు. మరో 3,70,999 మంది స్టూడెంట్లు ఫెయిల్ అయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థి తి లేకపోవడంతో అందరినీ పాస్ చేయాలని సర్కార్ భావిస్తోంది. అయితే ఫెయిల్ అయిన వారిలో జీరో మార్కులు వచ్చిన వారితో పాటు 34 మార్కులు వచ్చిన వారూ ఉన్నారు. వీరందరినీ ఎలా ఒకే గాటన కట్టాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడు తున్నారు.

ఇంప్రూవ్ మెంట్ లేనట్టే..

ఏపీతో పాటు పలు రాష్ర్టాల్లో అమలు చేస్తున్న విధానాలను ఇంటర్ బోర్డుఅధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఎస్ ఈ అమలు చేస్తున్నపద్ధతులనూ అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రం పరిధిలోని సెంట్రల్ బోర్డుతోనూ సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అయితే ఈసారి ఇంప్రూవ్ మెంట్ రాసుకోవడానికి అవకాశం లేనట్టే కనిపిస్తోంది.

 అందరికీ మినిమమ్ మార్కులు!

ప్రస్తుతం ఇంటర్ లో మార్కులను బట్టి 5 గ్రేడింగ్స్ ఉన్నాయి. 75 శాతం మార్కులకు పైగా వస్తే ‘ఎ’ గ్రేడ్, 60 నుంచి 75శాతం లోపు వస్తే ‘బి’, 50 నుంచి 60శాతం మధ్య వస్తే ‘సి’, 35 నుంచి 50శాతం లోపు వస్తే ‘డి’ గ్రేడ్ ఇస్తారు. ఫెయిల్ అయితే ‘ఎఫ్’ గ్రేడ్ ఇస్తారు. అయితే ఫెయిల్ అయిన స్టూడెంట్ల కోసం సర్కార్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో వారందరినీ రెగ్యులర్ స్టూడెంట్ల కేటగిరిలోనే కంపార్ట్మెంటల్ పాస్ చేయాలనే ఆలోచనా అధికారుల్లో ఉంది. దీని ద్వారా జీరో వచ్చిన స్టూడెంట్ తో పాటు 34 మార్కులు వచ్చిన వారికైనా మినిమమ్ మార్కులు 35 ఇచ్చి పాస్ చేస్తారు. ఈ వి ధానాన్ని ఏపీలో అమలు చేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. అలా కాకుంటే ప్రస్తుతం ఫెయిల్ అయిన స్టూడెంట్లకు ఎఫ్ అనే గ్రేడ్ కాకుండా సీపీ (కండోనేషన్ పాస్ ) అని పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మెమోలో పాస్ గానే చూపించనున్నారు. వారికి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో ఆయా మార్కులు అలాగే మెమోల్లో ఉంటాయి.