ఆ సర్పంచ్​ను సస్పెండ్​ చేయండి

ఆ సర్పంచ్​ను సస్పెండ్​ చేయండి

ఇసుక అక్రమ రవాణాపై
మంత్రి ఎర్రబెల్లి సీరియస్​
ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు ఆదేశం

పాలకుర్తి, వెలుగు: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఆ సర్పంచ్​ను వెంటనే సస్పెండ్​ చేయాలని స్థానిక ఎమ్మెల్యే, పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు కలెక్టర్​ కె. నిఖిలను ఆదేశించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ క్యాంపు ఆఫీసులో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లతో సీసీ రోడ్ల పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లను సీసీ రోడ్లు పూర్తి చేయడంలో ఎందుకు లేటవుతోందని ప్రశ్నించారు.

దేవరుప్పుల వాగు నుంచి ఇసుక తీసుకురావడంలో ఇబ్బందులు అవుతున్నాయని, తహసీల్దార్​ అడ్డుకుంటూ ఫైన్లు వేస్తున్నారని మంత్రికి చెప్పారు. దీంతో దేవరుప్పుల తహసీల్దార్​ఫరీదొద్దిన్​ను ఎర్రబెల్లి వివరణ కోరారు. ఆయన లేచి ఇసుకను అక్రమాలకు వాడుకుంటున్నారని, రూ. 3 వేలకు లోడ్​ తీసుకెళుతూ బయట బ్లాక్​లో రూ. 8 వేలకు అమ్ముకుంటున్నారని వివరించారు. ఎవరు అలా చేస్తున్నారని మంత్రి అడగడంతో కోలుకొండ గ్రామ టీఆర్ఎస్​సర్పంచ్​కుర్నాల రవి అంటూ తహసీల్దార్​ వివరించారు. దీంతో సీరియస్​ అయిన ఎర్రబెల్లి ఆ సర్పంచ్​ను సస్పెండ్​ చేయాలని పక్కనే ఉన్న కలెక్టర్​ నిఖిలను ఆదేశించారు.