భర్త తలాక్ చెప్పాడని.. గుజరాతీ మహిళ సూసైడ్ అటెంప్ట్

భర్త తలాక్ చెప్పాడని.. గుజరాతీ మహిళ సూసైడ్ అటెంప్ట్

భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడంటూ గుజరాత్ లో ఓ మహిళ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇస్లాం చట్టాల ప్రకారం భర్త తనకు విడాకులిస్తానన్నాడనీ… తనకు చావు తప్ప మరో శరణ్యం లేదని ఏడుస్తూ చెప్పింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పార్లమెంట్ లో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందులు ఇక ఉండవని కేంద్రం చెబుతోంది. అప్పటికప్పుడు మూడుసార్లు తలాక్ అని చెప్పడం.. విడాకులిస్తానంటూ బెదిరించడం… భార్యను వేధించడమే అని చట్టం చెబుతోంది. దీనిపై నిందితులైన భర్తలకు చట్టప్రకారం శిక్ష పడుతుంది.

అహ్మదాబాద్ లో ఓ ముస్లిం మహిళ మంగళవారం నాడు ఆత్మహత్యాయత్నం చేసింది. ఓ కూతురు కూడా ఉన్న ఆమెను ఇరుగుపొరుగు కాపాడారు. “నా భర్త ఏం చేసైనా సరే నన్ను డబ్బులు సర్దమన్నాడు. కోపంతో బిడ్డను విసిరేసి… మూడుసార్లు తలాక్ చెప్పాడు. మా చట్టాల ప్రకారం నేను చేయాల్సిందేమీ లేదు. దానిని అంగీకరించాల్సిందే” అని ఆమె బాధపడుతూ మీడియాకు చెప్పింది.

ఈ సంఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. లోన్ కోసం భార్య దగ్గర డబ్బులు, డాక్యుమెంట్ అడిగినట్టు భర్త ఒప్పుకున్నాడనీ… ఇవ్వకపోతే తలాక్ చెబుతా అని బెదిరించాడని పోలీసులు చెప్పారు. ఈ కేసు ట్రిపుల్ తలాక్ కిందకు వస్తుందా రాదా అన్నది తేలుస్తున్నామన్నారు. ఒకవేళ వస్తే.. ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కేసులో నేరం రుజువైతే భర్తను గరిష్టంగా మూడేళ్లు జైల్లో పెడతారు.