పనులు చేయక పోతే టీఆర్ఎస్‌కూ వాత తప్పదు

పనులు చేయక పోతే టీఆర్ఎస్‌కూ వాత తప్పదు

యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణలో ఎన్నికలంటే ప్రతి పక్ష పార్టీలకు వణుకు పుడుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ మండల కేంద్రంలో గురువారం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు జగదీష్‌రెడ్డి. గతంలో కోర్టుల ఆర్డర్ తో తప్పనిసరి పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించేవారని.. ఇప్పుడు సాకులు చూపుతూ ప్రతిపక్షాలు ఎన్నికలు ఆపటానికి కేసులు వేస్తున్నాయన్నారు. 70 ఏళ్ల భారత దేశ చరిత్రలో మానిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు.

ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు

స్థానిక సంస్థల్లో దేశంలోనే రికార్డు స్థాయిలో 32కి 32 గెలిచిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ లో ఎగిరెగిరి దుంకిన బీజేపి లక్ష్మణ్ బొక్క బోర్లా పడ్డాడని తెలిపారు. ప్రతి పక్ష పార్టీలకు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే.. అభివృద్ధి గురించి చెప్పటం లేదన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలు వాత పెట్టారని.. చెప్పిన పనులు చేయక పోతే టీఆర్ఎస్ కు కూడా వాత పెడతారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఏస్ దేనని.. సీఎం కేసీఆర్ కృషి వల్ల వ్యవసాయం దండగ నుంచి పండగ స్థాయికి వచ్చిందన్నారు. తెలంగాణ రైతు వైపు దేశం గౌరవంగా చూస్తుందని.. గులాబీ కండువా ఉంటేనే గౌరవం ఇచ్చే పరిస్థితి. టీఆర్ఎస్ వెంట ఉంటేనే పనులు అవుతాయని ప్రజలకు తెలుసని చెప్పారు జగదీష్ రెడ్డి.