భారత్ బంద్​ సక్సెస్ చేయాలె

భారత్ బంద్​ సక్సెస్ చేయాలె
  • 27న భారత్ బంద్​ను సక్సెస్ చేయాలె
  • కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల పిలుపు

ముషీరాబాద్,వెలుగు: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27న చేపట్టే భారత్ బంద్​ను సక్సెస్  చేయాలని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, టీజేఎస్ నిర్ణయించాయి. శనివారం బాగ్​ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయా పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 22న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టాలని, 27న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన భారత్ బంద్​​ను సక్సెస్ చేయాలని, అందుకు జనం సహకరించాలని కోరారు.  ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..దేశంలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం ఉందన్నారు. అగ్రిచట్టాలను రద్దు చేయాలన్నారు. పోడు రైతులకు ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు.  కార్మిక కోడ్​లను రద్దు చేయాలని, వారి హక్కుల పరిరక్షించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను  ఆదిబట్ల వద్ద పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. అరెస్ట్ చేసిన సీఐటీయూ నాయకులను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు లేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి పేదలు, మధ్యతరగతి వారిపై భారం మోపుతోందన్నారు. మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.   టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు జనం కదిలి రావాలని కోరారు. సమావేశంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వేముల పల్లి వెంకట్రామయ్య, రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.