ఔటర్ రింగ్ రోడ్డు వెంట నీటి కష్టాలకు చెక్

ఔటర్ రింగ్ రోడ్డు వెంట  నీటి కష్టాలకు చెక్
  • త్వరలో ఓఆర్ఆర్ వాటర్​ప్రాజెక్టు ఫేజ్ -2 కంప్లీట్
  • జూన్​ లో అందుబాటులోకి తెచ్చేందుకు వాటర్ బోర్డు నిర్ణయం
  • 7  కార్పొరేషన్లు,18 మున్సిపాలిటీలు, 190 పంచాయతీలకు లబ్ధి 


హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు సమీప గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరాకు వాటర్​బోర్డు చేపట్టిన ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్ –2  పూర్తి కావస్తోంది. గతేడాదే  ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉండగా పనులు కొంత ఆలస్యమైనా తాజాగా 90 శాతం మేరకు కంప్లీట్ అయినట్టు అధికారులు తెలిపారు. ఈనెలలోనే మిగతా వర్క్స్ పూర్తి చేసి జూన్​ఆఖరు నాటికి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట ఔటర్​సమీప కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు, విల్లాలకు నీటి పంపిణీకి వాటర్ బోర్డు ఔటర్​వాటర్ ప్రాజెక్టును ప్రారంభించింది.

 ఫేజ్​–1,ఫేజ్​–2  కింద పనులు చేపట్టింది. ఇప్పటికే ఫేజ్​–1 పూర్తి చేసి తాగునీటిని కూడా అందిస్తోంది. ఫేజ్​–2 లో భాగంగా 73 రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇప్పటికే 90శాతానికి పైగా పూర్తి అయినట్టు తెలిపారు. గ్రేటర్ సిటీ పరిధిలో కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గతంలో రోజుకు 350 ఎంజీడీల నీటిని అందించగా.. ఔటర్​ సమీప ప్రాంతాలకు సైతం నీటిని అందించాలనే లక్ష్యంతో మరో 150 ఎంజీడీల నీటిని కేటాయించారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాజెక్టును చేపట్టారు.  

 రూ. 613 కోట్లతో  ఫేజ్ –1 పనులు 

బల్దియా వెలుపల, ఔటర్ లోపలి ప్రాంతాలకు తాగునీటి పంపిణీకి ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్–-1 ద్వారా రూ. 613 కోట్లతో  కొత్తగా  164  రిజర్వాయర్లు నిర్మించారు. 1,571 కిలో మీటర్ల మేర పైపు లైన్ నెట్ వర్క్ వేశారు. దీంతో 7 మున్సిపల్ కార్పొరేషన్లు,18 మున్సిపాలిటీల పరిధిలోని190 గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోని మొత్తం 4.36 లక్షల మంది ప్రజలు సౌకర్యం పొందారు. తుక్కుగూడ, పహాడీ షరీఫ్, సుల్తాన్ పూర్, కాషాన్ గుట్ట, గుర్రంగూడ, కమ్మగూడ, తిరుమల నగర్, నంది హిల్స్ తదితర ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నారు.

రూ.1200 కోట్లతో ప్రాజెక్టు–2 పనులు

 ప్రాజెక్టు–2ను వాటర్​బోర్డు రూ. 1200 కోట్లతో చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, పైప్​లైన్​ వ్యవస్థను నిర్మించాలని అధికారులు ప్లాన్ రూపొందించి పనులు ప్రారంభించారు. ఓఆర్ఆర్ ఫేజ్ –- 2 ప్రాజెక్టు కింద కొత్తగా 73 సర్వీసు రిజర్వాయర్లు (138 మిలియన్ లీటర్ల సామర్థ్యం), 2,988 కిలో మీటర్ల మేర కొత్త పైపు లైను నెట్ వర్క్ ను వేస్తున్నారు.  పనులు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే మొత్తం 3.6  లక్షల కుటుంబాలు, 25 లక్షల జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీలు లబ్ధి పొందుతాయి. 

రెండు ప్యాకేజీల్లో కంప్లీట్ చేసేందుకు.. 

ఔటర్​వాటర్ ప్రాజెక్టును రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్, కీసర (7 మండలాలు) పరిధిలో మొత్తం 4.36 లక్షల మంది ప్రయోజనం పొందుతారు. కొత్తగా 38 సర్వీసు రిజర్వాయర్లు, 1,270 కిలో మీటర్ల మేర పైపు లైన్ నెట్ వర్క్ నిర్మాణం చేపడుతుండగా, అయ్యే ఖర్చు రూ. 587 కోట్లు. దీని పరిధిలోకి రాజేంద్రనగర్, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం (5 మండలాలు) వస్తాయి. మొత్తం 1.96 లక్షల మందికి లబ్ధి కలగనుందని అధికారులు తెలిపారు.