అభిమానం ఉండొచ్చు .. కానీ అది అవధులు దాటకూడదు. సెలబ్రిటీలను చూడాలనే ఆశ్రుత ఉండొచ్చు.. కానీ అది వారి ప్రాణాల మీదకు తెచ్చేలా ఉండరాదు. కానీ లేటెస్ట్ గా హైదరాబాద్ లోని లూలూ మాల్ సాక్షిగా బుధవారం రాత్రి కలవరపెట్టే దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'ది రాజాసాబ్ ' ప్రమోషన్స్ లో భాగంగా నిర్విహించిన 'సహన సహన' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. ఒక్కోసారి అభిమానం హద్దులు దాటితే ఆరాధనగా కాకుండా వేధింపుగా మారుతుందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ ఘటన . నిధి అగర్వాల్ కు ఎదురైన ఈ చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలోని ‘సహన సహన’ అనే సాంగ్ లాంచ్ వేడుకను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నిధి అగర్వాల్‌తో పాటు రిధి కుమార్, దర్శకుడు మారుతి హాజరయ్యారు. ప్రభాస్ సినిమా కావడంతో వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. అయితే, ఈవెంట్ ముగిసి నిధి తిరిగి వెళ్తున్న సమయంలో అసలు అరాచకం మొదలైంది.
సెక్యూరిటీ వలయాన్ని చీల్చుకుంటూ అభిమానులు ఒక్కసారిగా నిధిపైకి దూసుకొచ్చారు. సెల్ఫీల కోసం, ఆమెను తాకడం కోసం జనం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తన చున్నీని గట్టిగా పట్టుకుని, భయంతో వణికిపోతూ ఆమె కారు వైపు పరుగులు తీయాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను తోసేస్తూ ఆమెను అతికష్టం మీద కారులోకి పంపించారు. కారు ఎక్కగానే ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన చూస్తే, అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Disturbing visuals of Actress #NidhhiAgerwal getting mobbed by a group of men/fans at an event in Hyderabad 😰 pic.twitter.com/i1LrOUWm9c
— Deepu (@deepu_drops) December 17, 2025
మండిపడుతున్న నెటిజన్లు - చిన్మయి ఫైర్!
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఇది అభిమానం కాదు, పైశాచికత్వం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రీటీల భద్రత విషయంలో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వహించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా సింగర్ చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వీళ్లు మనుషులు కాదు, జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాలను వేరే గ్రహానికి పంపేయాలి" అంటూ ఘాటుగా స్పందించారు. ఒక మహిళ పట్ల కనీస మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హారర్-కామెడీ నేపథ్యంలో వస్తున్న ప్రభాస్ ‘రాజాసాబ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్, ఈసారి విభిన్నమైన లుక్ , మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
