ధనుర్మాసం కొనసాగుతుంది, విష్ణుభగవానుడి రకరకాల ప్రసాదాలు చేసి దేవుళ్లకి నైవేద్యాలుపెడుతుంటారు. ఈ మాసంలో దేవుడికి రోజుకో నైవేద్యం పెడుతుంటారు. వాటిలో కొన్ని రకాల పాయసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. .
పెసరపప్పు పాయసం తయారీకి కావలసినవి
- పెసరపప్పు: ఒక కప్పు
- నీళ్లు: 3/4కప్పు
- బెల్లం: 1 1/2కప్పు
- పచ్చికొబ్బరి తురుము : 1/2 కప్పు
- యాలకుల పొడి: 1/2 టీ స్పూన్
- జీడిపప్పు: 1టేబుల్ స్పూన్
- ఎండు ద్రాక్ష : 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ఒక గిన్నెతీసుకొని పొయ్యిమీద పెట్టి పెసర పప్పు వేసి వేగించాలి. కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పును ఎండు ద్రాక్షను వేగించి పక్కన పెట్టాలి. తరువాత పొయ్యి మీద గిన్నె పెట్టి బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగించి వడక ట్టాలి. మరలా అదే గిన్నెలో వడకట్టిన బెల్లం నీళ్లు పోసి కొబ్బరి తురుమువేసి నిమిషాలు ఉడికించాలి. అందులో ఉడికించిన పెసరపప్పు వేసి కలపాలి. అడుగు మాడిపోకుండా కలపాలి. చివరిగా యాలకుల పొడి వేగించుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. అంతే టేస్టీతో కూడిన పెసరపప్పు పాయసం రెడీ..
శెనగపప్పు పాయసం తయారీకి కావలసినవి
- శెనగపప్పు :3/4కప్పు
- బెల్లం తురుముG 1 కప్పు
- పాలు: 1/2కప్పు
- ఎండు కొబ్బరి ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి: 1/2 టీస్పూన్
- జీడిపప్పు : 1 టేబుల్ స్పూన్
- ఎండు ద్రాక్ష: 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ఒక గిన్నెతీసుకొని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేసి శెనగపప్పు వేసి 4 నిమిషాలు వేగించాలి. కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పును, ఎండు ద్రాక్షను వేగించి పక్కన పెట్టాలి. తరువాత పొయ్యి మీద గిన్నె పెట్టి బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగించి వడకట్టాలి.
మరలా అదే గిన్నెలో వడకట్టిన బెల్లం నీళ్లు 2నిమిషాలు ఉడికిం చాలి. అందులో ఉడికించిన శెనగపప్పును వేసి కలపాలి. అడుగు మాడిపోకుండా కలపాలి. పాలు పోసి 2 నిమిషాలు ఉడికిం చాలి. చివరగా యాలకుల పొడి వేగించు కున్న డ్రై ఫ్రూట్స్ , ఉడికించిన శెనగలు రెండు స్పూన్లు వేసి కలపాలి..
గోధుమ రవ్వ పాయసం తయారీకి కావలసినవి
- గోధుమ రవ్వ: 1/2 కప్పు
- పెసరపప్పు: 2 టేబుల్ స్పూన్లు
- బెల్లం తురుము : 1/2 కప్పు
- యాలకులపొడి 1 టీ స్పూన్
- నీళ్లు : 2 కప్పులు
- మీగడపాలు: 2 కప్పులు
- నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
- జీడిపప్పు: 10
- ఎండుద్రాక్ష: 10
తయారీ విధానం : రవ్వ, పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రం చేసి ఆరబెట్టాలి. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి బెల్లం తురుము వేసి కొంచెం నీళ్లు పోసి కరిగించాలి. తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు.. ద్రాక్షను వేసి వేగించి పక్కన పెట్టాలి. మళ్లీ కొంచెం నెయ్యి వేసి రవ్వ... పెసరపప్పులను వేగించాలి. తరువాత అందులో కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులో పాలు పోసి 2 నిమిషాలు ఉడికించాలి. తరువాత కొంచెం యాలకుల పొడి వేసి కలపాలి. ముందుగా కరిగించిన బెల్లం వేసి బాగా కలపాలి . చివరగా2 నిమిషాలు ఉడికించి చివరిగా గార్నిషింగ్ చేయాలి. ఇక అంతే నోరూరించే గోధుమరవ్వ పాయసం రెడీ..!
–వెలుగు,లైఫ్–
