ఉపాధి హామీ కూలీలా పొట్ట కొట్టేందుకు.. కేంద్ర ప్రభుత్వం కుట్ర.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ఉపాధి హామీ కూలీలా పొట్ట కొట్టేందుకు.. కేంద్ర ప్రభుత్వం కుట్ర.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

రాముడి పేరుతో ఉపాధి హామీ కూలీలా పొట్టకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రను చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఆయన ఖండించారు. గురువారం ( డిసెంబర్ 18) హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో  నూతన ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ , బిల్లు ప్రతులను సీపీఎం నేతలు తగులబెట్టారు. 

ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టాన్ని నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఉన్న పనిదినాలు పెంచుతూనే.. ఈ పథకానికి నిధుల కోత పెట్టడం దుర్మార్గం అన్నారు. గతంలో 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వంఇచ్చేది.. కొత్త బిల్లు ప్రకారం.. 60 శాతం నిధులను మాత్రమే ఈ పథకానికి ఇవ్వనుందన్నారు. నిధులను తగ్గించి ఉపాధి హామీ కూలీ ల పొట్ట కొట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఈ బిల్లు చట్టం అయితే  కూలీలను పనులు దొరకడం కష్టమవుతుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని , పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న అన్ని మండల , పట్టణ ప్రాంతాలలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని జాన్ వెస్లీ హెచ్చరించారు.