బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. రెండు వీసా సెంటర్లు క్లోజ్ చేసిన ఇండియా..

 బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. రెండు వీసా సెంటర్లు క్లోజ్ చేసిన ఇండియా..

బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి, ఖుల్నా నగరాల్లో ఉన్న రెండు భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను (IVAC) ఇవాళ  (గురువారం 18) మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 

IVAC వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం బంగ్లాదేశ్‌ దేశంలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని IVAC రాజ్‌షాహి, ఖుల్నాలో వీసా అప్లికేషన్  సెంటర్లను ఈరోజు (18 గురువారం) మూసేస్తున్నాము. వీసా కోసం అపాయింట్‌మెంట్ స్లాట్‌లను బుక్ చేసుకున్న దరఖాస్తుదారులందరికీ తరువాత తేదీలో మళ్లీ అవకాశం కల్పిస్తామని పేర్కొంది. 

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉన్న భారత హైకమిషన్ కు కొద్దిరోజుల క్రితం బెదిరింపులు వచ్చాయి. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడి నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు ఒకరు భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

 ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి నిరసనను వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ప్రజలతో భారత్ కు మొదటి నుంచి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అక్కడ శాంతి, స్థిరత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాము. అయితే, మా రాయబార కార్యాలయాలు, సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.