వార్ షిప్స్ పంపేందుకు బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ నిరాకరణ
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధికి యుద్ధనౌకలు పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాటో దేశాలు, చైనా, జపాన్, దక్షిణ కొరియాను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. సాయంచేయని దేశాలను అమెరికా గుర్తుంచుకుంటుందని, నాటో భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని బెదిరించారు. ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. హార్మూజ్ జలసంధి ద్వారా నౌకా ప్రయాణం జరిగితే ఎక్కువ ప్రయోజనం పొందేది ఇతర దేశాలేనని..
అమెరికాకు సొంత చమురు ఉందని అన్నారు.
పనిచేయని ట్రంప్ వార్నింగ్ లు
యుద్ధ నౌకలు పంపాలని పలు దేశాలకు ట్రంప్ చేసిన హెచ్చరికలు పని చేయలేదు. ఈ విషయంపై జపాన్ ప్రధాని పార్లమెంటులో మాట్లాడుతూ యుద్ధనౌకలు పంపించే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తమను అడగనే లేదని, నౌకలు పంపే ప్రశ్నే లేదని ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. ఈ అంశంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ ఇది నాటో మిషన్ కాదని, విస్తృత యుద్ధంలోకి దిగవద్దని చెప్పారు. జర్మనీ కూడా ఇది నాటో యుద్ధం కాదంటూ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఖర్గ్ ద్వీపం స్వాధీనానికి అమెరికా యోచన
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేసిన జాన్ ఉల్యోట్ మీడియాతో మాట్లాడుతూ ‘ఖర్గ్స్వాధీనం జరుగుతుందా? లేదా? అనేది ప్రశ్న కాదు. ఎప్పుడు జరుగుతుందనేది మాత్రమే ప్రశ్న’’ అని పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి 35 మైళ్ల దూరంలో ఉండే ఈ చిన్న ద్వీపం నుంచే ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% జరుగుతుంది. రోజూ 70 లక్షల బ్యారెళ్లు లోడ్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.
