- మంత్రుల సమీక్షతో పనుల్లో స్పీడప్
- రూ.22కోట్లు మంజూరు చేయగా.. ఇటీవల రూ.16కోట్లు రిలీజ్
- కొనసాగుతున్న రివిట్‌మెంట్ పనులు
- జూన్ లోగా పనులు పూర్తి చేసేందుకు ప్లాన్
- పనులు నడుస్తుండడంతో క్రాప్ హాలిడే ప్రకటించిన అధికారులు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు రిపేర్ పనులు షురూ అయ్యాయి. ఇటీవల ప్రాజెక్టు ఎడమ భాగంలో 8 కిలోమీటర్ల పొడవున్న కట్ట 600 మీటర్ల రివిట్‌మెంట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసిందే. డ్యామ్ సేఫ్టీలో భాగంగా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచన మేరకు ప్రభుత్వం ప్రాజెక్టుకు రిపేర్ పనులు మొదలుపెట్టింది. ఈ పనులపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మైనింగ్, కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూలు నిర్వహిస్తుండడంతో పనులు స్పీడందుకున్నాయి.
రిపేర్లకు రూ.22కోట్లు మంజూరు
సింగూరు ప్రాజెక్టు రిపేర్ కోసం ప్రభుత్వం రూ.22 కోట్లు శాంక్షన్ చేయగా, ఇటీవల మొదటి విడతగా రూ.16 కోట్లు రిలీజ్ చేసింది. ఈ క్రమంలో దశలవారీగా ప్రాజెక్టు నీటిని ఖాళీ చేసి రిపేర్లు చేయిస్తున్నారు. సింగూరులో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. రిపేర్ పనులు మొదలు పెట్టారు. ఈ వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు బాగా పెరిగింది.
అలల తాకిడి ఎక్కువై ప్రాజెక్టు లోపలి భాగంలో ఏర్పడిన బుంగలను పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించారు. దాదాపు 40 వేల కంకర, ఇసుక బస్తాలతో రిపేరు పనులు చేయించినా ప్రయోజనం లేకపోగా డ్యామేజ్ రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డిఎస్ఏ) బృందం ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేయడంతో ప్రాజెక్టులోని 6 టీఎంసీల నీటిని బయటికి వదిలి రిపేర్ పనులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించారు.
వారి సూచనల మేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసి రిపేర్ పనులు చేయిస్తోంది. దెబ్బతిన్న రివిట్‌మెంట్‌ను తొలగిస్తూ రాళ్లతో కొత్తది నిర్మిస్తున్నారు. మరో 50 ఏళ్ల వరకు ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతులు జరుగుతున్నాయి. నాలుగు రోజులు కింద ఎన్‌డీఎస్‌ఏ టీం చైర్మన్ విజయ్ త్రయంబక్ దేశాయ్ నేతృత్వంలో బృందం సభ్యులు రిపేర్ పనులను పరిశీలించారు.
రిపేర్ పనులతో క్రాప్ హాలీడే
ఉమ్మడి మెదక్ జిల్లా వరప్రదాయినిగా సింగూరు ప్రాజెక్ట్ ఉంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. డ్యామ్ రిపేర్ పనుల నేపథ్యంలో అధికారులు ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు. సింగూరు ప్రాజెక్టుపై దిగువ భాగంలోని మంజీరా బ్యారేజీ, మెదక్ జిల్లా వనదుర్గ (ఘనపురం) ఆనకట్ట, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు హైదరాబాద్ జంట నగరానికి మెట్రోపాలిటన్, మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రాజెక్టు తాగునీటిని అందిస్తూ వస్తోంది. కాగా వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా దశలవారీగా నీటి అవసరాలను మిషన్ భగీరథ ద్వారా వినియోగిస్తున్నారు.
స్పీడ్‌గా పెద్దారెడ్డిపేట లిఫ్ట్ పనులు
సింగూరు ప్రాజెక్టు ఎగువ భాగంలో పెద్దారెడ్డిపేట వద్ద లిఫ్ట్ నిర్మించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్లాన్ చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు ఉగాదిలోగా శంకుస్థాపన చేయాలని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహ ఆదేశించడంతో ఆ దిశగా పనులు మొదలుపెట్టారు. ఈ లిఫ్ట్ ద్వారా ప్రాజెక్టు ఎగువ భాగంలోని ఆందోల్, టేక్మాల్, రేగోడు మండలాలకు కూడా సాగునీరు అందనుంది.
