రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? : హరీశ్ రావు

రాష్ట్రాన్ని చంద్రబాబుకు  తాకట్టు పెట్టారా? : హరీశ్  రావు
  • ప్రభుత్వ చేతగానితనంతో.. ఏపీ గోదావరి నీళ్లు దోచేస్తున్నది: హరీశ్  రావు
  •     బనకచర్లను ఎజెండాలో పెట్టినా ఎందుకు మీటింగ్​కు పోయారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణాలో యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడిన ఏపీ.. ఇప్పుడు ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతగానితనాన్ని ఆసరాగా చేసుకుని గోదావరి జలాలపై పడిందన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్​లో మాట్లాడారు. ‘‘జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచుకునేందుకు ఈ మీటింగ్​ ద్వారా ఏపీ ప్లాన్ చేసింది. 

గోదావరిలో ఏ రాష్ట్రానికీ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గం. ఢిల్లీ మీటింగ్‌‌‌‌కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చాయి. ఈ రోజు మార్చి 16. నెల రోజులు దాటిపోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా?’’ అని హరీశ్​ రావు మండిపడ్డారు.  

ట్రిబ్యునల్ ను ధిక్కరించడమంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే

గోదావరి, బనకచర్ల అంశాలు ఎజెండాలో లేకపోతేనే ఢిల్లీ మీటింగ్‌‌‌‌కు వెళ్తామని ముందు  చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం పోలవరం, నల్లమల్ల సాగర్ అంశాలను ఎజెండాలో పెట్టినా కూడా వెళ్లిందని హరీశ్​ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ మినిట్స్ పేజీ 3లో రాష్ట్రాల మధ్య గోదావరి జలాల కేటాయింపులు అసలు లేవని ఏపీ చెప్పినట్లు ఉందన్నారు. 

దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదంటే, తెలంగాణకు వాటా లేదని అంగీకరించినట్టేనా అని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకపోతే గోదావరిపై పలు రాష్ట్రాలలో సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇచ్చిందన్నారు. ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడిది? అని నిలదీశారు. ఏపీ సర్కార్ ట్రిబ్యునల్‌‌‌‌ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని పేర్కొన్నారు.

కృష్ణా వాటాలనూ కాపాడలేకపోతున్నరు

కృష్ణా నదిలో ఉన్న 34 శాతం తాత్కాలిక వాటాను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతున్నదని హరీశ్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 18 టెలిమెట్రీలు ఏర్పాటు చేశామని, కానీ,వాటి నిర్వహణ కోసం ఇచ్చిన రూ. 4.5 కోట్లను కేఆర్ఎంబీ అధికారులు తమ జీతాలకు వాడుకుని, బ్రిజేశ్ కుమార్ అవార్డు వచ్చేదాకా కొత్త టెలిమెట్రీలు పెట్టేది లేదని తేల్చిచెప్పారని గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

ఆదివారాలు కూడా సభ నడపాలె

అసెంబ్లీని ఈ నెల 30 వరకు నడుపుతామని ప్రభుత్వం అంటున్నా.. అందులో 2 ఆదివారాలు, 2 పండుగలు పోతే ఇంకెన్ని రోజులు సభ నడిపినట్టని హరీశ్ ప్రశ్నించారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్​చాట్​ చేశారు. ఆదివారాలు కూడా సభ నడపాలని డిమాండ్​ చేశామన్నారు. ఈ నెల 31 దాకా సభ నడపాలన్నారు. కాగా, హౌస్​ కమిటీల ఏర్పాటు ఆలస్యమైందని బీఏసీలో చెప్పామని, కమిటీలు వేస్తామన్నారని పేర్కొన్నారు. 

ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరామని తెలిపారు. సీఎంపై బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదన్నారు. ప్రివిలేజ్​ మోషన్స్ డిప్యూటీ స్పీకర్​ స్వీకరిస్తారని, ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్​ను నియమించనే లేదని పేర్కొన్నారు.