ఎల్పీజీ కొరత లేదనడం అబద్ధం..ఒక్కో సిలిండర్ బ్లాక్లో రూ.5వేలకు అమ్ముతున్నరు: ఖర్గే

ఎల్పీజీ కొరత లేదనడం అబద్ధం..ఒక్కో సిలిండర్ బ్లాక్లో రూ.5వేలకు అమ్ముతున్నరు: ఖర్గే
  • సంక్షోభ పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారు: నడ్డా
  • రాజ్యసభలో ప్రతిపక్షనేత, కేంద్ర మంత్రి మాటల యుద్ధం

న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎల్పీజీ దొరక్క పేదలు, హాస్టళ్లు, హోటళ్లు ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు, చాలా నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు.

ఎల్పీజీ కొరతపై సోమవారం రాజ్యసభలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. జీరో అవర్ లో మల్లికార్జున ఖర్గే ఎల్పీజీ కొరత సమస్యను లేవనెత్తారు. గ్యాస్ కొరత లేదని పెట్రోలియం మంత్రి లోక్‌‌‌‌సభలో చెప్పారు కానీ అది నిజం కాదని, ప్రజలు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, వాణిజ్య వినియోగదారులు ఇలా ఎంతోమంది తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్​లో ఒక్కో సిలిండర్ రూ.5,000కి అమ్ముతున్నారని సభ దృష్టికి తెచ్చారు. సిలిండర్ బుకింగ్ వెయిటింగ్ టైమ్​అర్బన్​లో 25 రోజులకు, గ్రామాల్లో 45 రోజులకు పెరిగిందన్నారు. దీంతో ప్యానిక్ బుకింగ్, హోర్డింగ్ పెరిగిపోయాయని విమర్శించారు.

దేశంలో 60 శాతం ఎల్పీజీ దిగుమతి అవుతుందని, అందులో 90 శాతం హార్మూజ్ జలసంధి ద్వారా వస్తుందని ఆయన వివరించారు. ముందస్తు ప్రణాళిక వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే 
ఈ పరిస్థితి వచ్చేది కాదని ఖర్గే నిలదీశారు.

కాంగ్రెస్ ​ప్రజలను రెచ్చగొడుతున్నది: నడ్డా

ఖర్గే విమర్శలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా గట్టిగా జవాబిచ్చారు. ఒక కాంగ్రెస్ నేత సిలిండర్లు నిల్వ చేస్తూ పట్టుబడ్డారని విమర్శించారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వంతో కలిసి నిలవడానికి బదులు, ప్రజలను రెచ్చగొట్టడం కాంగ్రెస్‌‌‌‌కే చెల్లిందన్నారు.

ఈ సంక్షోభం కేంద్రం చర్యల వల్ల కాదని, ప్రపంచ పరిణామాల వల్ల వచ్చిందని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా జోక్యం చేసుకుంటూ, పెట్రోలియం మంత్రి లోక్‌‌‌‌సభలో వివరణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వినలేదని, రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశమిచ్చినా ఎల్పీజీపై కాకుండా వేరే అంశాలపై మాట్లాడారని విమర్శించారు. సమాజ్‌‌‌‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ సిలిండర్ కోసం ప్రజలు క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.