Oscar Autumn Durald: ఆస్కార్ 2026 సినిమాటోగ్రఫీలో మైలురాయి.. తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ‘ఆటం డ్యారాల్డ్’

Oscar Autumn Durald: ఆస్కార్ 2026 సినిమాటోగ్రఫీలో మైలురాయి.. తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ‘ఆటం డ్యారాల్డ్’

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ 2026) వేడుక గ్రాండ్‌‌గా జరిగింది. లాస్ ఏంజిల్స్‌‌లోని డాల్బీ థియేటర్‌‌లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ప్రజెంటర్‌‌‌‌గా సందడి చేసిన ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌‌‌‌ ఫిల్మ్ అవార్డును అందజేశారు. లియోనార్డో నటించిన ‘వన్‌‌ బ్యాటిల్‌‌ ఆఫ్టర్‌‌‌‌ అనదర్‌‌’ చిత్రం, ర్యాన్‌‌ కూగ్లర్‌‌‌‌ డైరెక్ట్‌‌ చేసిన ‘సిన్నర్స్‌‌’ చిత్రానికి అవార్డుల పంట పండింది.

నటుడు మైఖేల్ బి. జోర్డాన్.. ‘సిన్నర్స్‌‌’ చిత్రా నికి గాను తన కెరీర్‌‌లో మొదటి ఆస్కార్‌‌ను అందు కున్నారు.  అలాగే ‘హామ్నెట్' సినిమాలో నటనకు గాను జెస్సీ బక్లీ తన తొలి ఆస్కార్‌‌ను గెలుచుకున్నారు. ఉత్తమ సహాయ నటుడుగా 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'లో నటించిన షాన్ పెన్,  ఉత్తమ సహాయ నటిగా ‘వెపన్స్’లో నటనకు గాను అమీ మాడిగన్ ఆస్కార్‌‌ను‌‌ స్వీకరించారు.  

పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఈ ఏడాది ఆస్కార్ వేదికను శాసించింది. మొత్తం 6 విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది.

బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ అడాప్టెడ్‌‌ స్క్రీన్‌‌ ప్లే, బెస్ట్ ఎడిటింగ్‌‌తో పాటు కొత్తగా ప్రవేశ పెట్టిన బెస్ట్ కాస్టింగ్‌‌ కేటగిరీలోనూ అవార్డును గెలుచుకుంది.  ఇదొక బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. థామస్ పించోన్ రాసిన 'వైన్‌‌ల్యాండ్' అనే నవల ఆధారంగా 'పాల్ థామస్ ఆండర్సన్ ఓ మాస్టర్ పీస్‌‌లా దీన్ని తెరకెక్కించారు.

నాలుగు అవార్డులతో ‘సిన్నర్స్‌‌’

ఆస్కార్‌‌‌‌ రేసులో పదహారు విభాగాల్లో పోటీపడిన ‘సిన్నర్స్‌‌’ చిత్రం నాలుగు అవార్డులతో సత్తా చాటింది. బెస్ట్ యాక్టర్‌‌‌‌, బెస్ట్‌‌ ఒరిజినల్ స్క్రీన్‌‌ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఒరిజినల్ స్కోరు విభాగాల్లో ఆస్కార్‌‌‌‌ గెలుచుకుంది. స్టీఫెన్ కింగ్ రాసిన ‘సేల‌‌మ్స్ లాట్’ న‌‌వ‌‌ల ఆధారంగా ర‌‌యాన్ కూగ్లర్‌‌‌‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  

ఒకే అవార్డు.. ఇద్దరు విజేతలు

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌‌ కేటగిరీ టై అవడంతో  ‘ది సింగర్స్’ చిత్రంతో పాటు  ‘టూ పీపుల్ ఎక్స్ఛేంజింగ్ సెలైవా’ చిత్రాన్ని విజేతగా ప్రకటించారు.  

సినిమాటోగ్రఫీలో తొలి మహిళగా 

బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు గెలుచుకున్న తొలి మహిళగా ఆటం డ్యారాల్డ్ అర్కాపా (సిన్నర్స్‌‌) నిలిచారు. ఈమె అమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ASC)కి చెందిన ఒక సినిమాటోగ్రాఫర్. అయితే, సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్ 2026కు నామినేట్ అయిన మొట్టమొదటి నల్లజాతి మహిళగా ‘సినర్స్’ సినిమాటోగ్రాఫర్ ఆటం డ్యూరాల్డ్ ఆర్కపావ్ నిలిచారు.

ఈ ఘనతపై ఆటం డ్యూరాల్డ్ మాట్లాడుతూ.. ‘‘యువతులు లేదా ఇతర నేపథ్యాల నుండి వచ్చిన ఫిల్మ్ విద్యార్థులు నా దగ్గరకు వచ్చి, కేవలం నా పనిని చూసి కాకుండా, కెమెరా వెనుక తమలాంటి వారిని చూడగలగడం వల్ల కృతజ్ఞతలు తెలిపినప్పుడు, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’’అని తెలిపారు.

ఆటం డ్యూరాల్డ్ ఈ ఘనతను కేవలం వ్యక్తిగత విజయం కాకుండా, సమానత్వానికి, Representation కి ఒక ప్రేరణగా చూస్తున్నారు. బెస్ట్ సపోర్టింగ్‌‌ యాక్టర్‌‌‌‌గా నిలిచిన షాన్ పెన్ గైర్హాజరుతో ఆయన తరపున నటుడు కిరణ్ కల్కిన్ ఈ అవార్డును స్వీకరించారు.

విజువల్ ఎఫెక్ట్స్​కు మరోసారి..యుద్ధానికి  నిరసనగా.. 

98వ ఆస్కార్ వేదిక సామాజిక నిరసనకు కూడా వేదికైంది. హాలీవుడ్ స్టార్ నటుడు జేవియర్ బార్డెమ్, బ్రిటిష్ నటి చరిత్ర చంద్రన్ యుద్ధానికి వ్యతిరేకంగా ‘నో టు వార్‌‌’ అనే బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు.   జేవియర్ బార్డెమ్ మాట్లాడుతూ.. 2003లో ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత యుద్ధ పరిస్థితులకు ట్రంప్, నెతన్యాహూల నిర్ణయాలే కారణమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఈ వేదిక ద్వారా గళం ఎత్తడం తన బాధ్యతని చరిత్ర చంద్రన్  కామెంట్ చేశారు. 

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ కేటగిరీలో ‘అవతార్‌‌‌‌ ఫ్రాంచైజీకి ఇది మూడో అవార్డు. 2010లో అవతార్‌‌‌‌,  2023లో ‘అవతార్‌‌‌‌: ది వే ఆఫ్​ వాటర్‌‌‌‌’ చిత్రాలకు ఇదే కేటగిరీలో అవార్డులు వచ్చాయి.

ఇక బ్రాడ్‌‌ పిట్‌‌ నటించిన స్పోర్ట్స్‌‌ డ్రామా ‘ఎఫ్‌‌ 1’కు బెస్ట్ సౌండ్‌‌ కేటగిరీలో అవార్డు లభించింది. ‘ఫ్రాంకెన్‌‌స్టైన్’ చిత్రం ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (కేట్ హాలీ)  విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఇక ఉత్తమ యానిమేటెడ్ చిత్రంతో పాటు ఉతమ ఒరిజినల్ సాంగ్‌‌ కేటగిరీలో ‘కె-పాప్ డీమన్ హంటర్స్’ చిత్రం రెండు ఆస్కార్‌‌‌‌లు గెలుచుకుంది.

ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నార్వేకు చెందిన  ‘సెంటిమెంటల్ వాల్యూ’ నిలవగా, బెస్ట్‌‌ డాక్యుమెంటరీ ఫీచర్‌‌‌‌గా ‘మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్’,  బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్, డాక్యుమెంటరీ షార్ట్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్ నిలిచాయి. 

ఆస్కార్‌‌ నివాళుల జాబితాలో..

గత ఏడాది  మరణించిన పలువురు గొప్ప నటీనటులను స్మరించుకుంటూ ఆస్కార్‌‌ నివాళులు అర్పించింది.  హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు భారతీయ సినీ దిగ్గజాలు ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్‌,  కోట శ్రీనివాసరావుల చిత్రాలను కూడా అధికారిక గ్యాలరీలో ప్రదర్శించి వారి సేవలను అకాడమీ కొనియాడింది.

అయితే హాలీవుడ్‌ ప్రముఖులకు నివాళులు అర్పిస్తూ ప్రదర్శించిన వీడియోలో ధర్మేంద్ర సహా ఇండియన్‌ నటీనటులను చూపించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

సమయాభావం వల్ల వీడియోలో అందరినీ చూపించలేదని, అయితే అందరి పేర్లను అధికారిక వెబ్‌ సైట్‌లో పొందుపరిచామని తెలియజేశారు. కోట లాంటి గొప్ప నటుడి సేవలను అంతర్జాతీయ వేదిక గుర్తించడం గర్వకారణమని సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.