- కోల్ కతా సీపీ, హోంశాఖ సెక్రటరీ కూడా ట్రాన్స్ఫర్
- ఆ నలుగురిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆర్డర్
- తీవ్రంగా ఖండించిన మమత.. రాజ్యసభ నుంచి టీఎంసీ వాకౌట్
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారమే జారీ చేసిన మొదటి ఆర్డర్‌లోనే బెంగల్ చీఫ్ సెక్రటరీ(సీఎస్) నందిని చక్రవర్తి, హోంశాఖ సెక్రటరీ జగదీశ్ ప్రసాద్ మీనాను బదిలీ పేర్కొంది. సోమవారం జారీ చేసిన రెండో ఆర్డర్‌లో డీజీపీ పీయూష్ పాండే, కోల్‌కతా పోలీసు కమిషనర్ సుప్రతిమ్ సర్కార్‌ను ట్రాన్స్ఫర్ చేసింది. సీఎస్ స్థానంలో 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాల, హోంశాఖ సెక్రటరీ స్థానంలో 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంఘమిత్ర ఘోష్‌ను నియమించింది.
డీజీపీ స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిధ్ నాథ్ గుప్తాను, కోల్‌కతా పోలీసు కమిషనర్ స్థానంలో అజయ్ కుమార్ నంద్‌ను నియమించింది. తొలగించిన అధికారులను ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఎన్నికలకు సంబంధించిన ఏ పదవిలోనూ నియమించవద్దని, ఆ బాధ్యతలు ఏవీ అప్పగించకూడదని కూడా ఆదేశించింది. ఈ నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని, సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు దీనిపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈసీ అధికార దుర్వినియోగం: టీఎంసీ
దీనిపై ఈసీ అధికారులు మాట్లాడుతూ.. బెంగాల్‌లో హింస లేకుండా, శాంతియుతంగా ఎన్నికలు జరిపిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ హామీ ఇచ్చారని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకే తాజా బదిలీలు చేశామని వెల్లడించారు. దేశంలో ఎల్పీజీ సంక్షోభంపై సోమవారం కలోకతాలో చేపట్టిన నిరసణలో బెంగాల్సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మాట్లాడుతూ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ టీఎంసీ సభ్యులు రాజ్యసభలో వాకౌట్ చేశారు.
పార్టీ నేత డెరెక్ ఓ బ్రియన్ మాట్లాడుతూ ‘‘అర్ధరాత్రి బెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీలను ఈసీ బదిలీ చేసింది. ఈసీకి ఆ అధికారం ఉంది, కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నరు”అని అన్నారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ఈసీ రాజ్యాంగ సంస్థ అని, దాని నిర్ణయాలను ప్రశ్నించడం సరికాదని అన్నారు.
