కన్నడ చిత్ర పరిశ్రమలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రానికి కో-డైరెక్టర్‌గా వ్యవహరించిన కీర్తన్ నాదగౌడ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటన యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కేజీఎఫ్ లాంటి భారీ చిత్రానికి పనిచేసి, దర్శకుడిగా ఎదుగుతున్న తరుణంలో కీర్తన్ కుటుంబంలో ఇలాంటి విషాదం పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
అసలేం జరిగింది?
మూడు రోజుల క్రితం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిన్నారి సోనార్ష్ తన తల్లిదండ్రుల కంటపడకుండా ఆడుకుంటూ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ వద్దకు వెళ్ళాడు. ఎవరూ గమనించని సమయంలో లిఫ్ట్ లోపలికి ప్రవేశించిన ఆ చిన్నారి, దురదృష్టవశాత్తు అందులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ కదులుతున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో సోనార్ష్ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రెస్క్యూ టీమ్ వచ్చి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేవలం నాలుగున్నరేళ్ల వయసులోనే ఆ బాలుడు తనువు చాలించడం కుటుంబ సభ్యులను కోలుకోలేని దెబ్బ తీసింది.
పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
ఈ హృదయ విదారక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కీర్తన్ నాదగౌడ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దర్శకుడు కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం తీవ్ర మనస్తాపం కలిగించింది. తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా రాణిస్తున్న కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు సోనార్ష్ మృతి చెందడం బాధాకరం. పుత్ర శోకం అనుభవిస్తున్న ఆ తల్లిదండ్రులకు ఆ పరమేశ్వరుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 15, 2025
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ…
కన్నీరు పెట్టిస్తున్న ఫోటోలు
కీర్తన్ తన కుమారుడితో ఉన్న జ్ఞాపకాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకునేవారు. గతేడాది అక్టోబర్‌లో సోనార్ష్ మూడవ పుట్టినరోజున 'స్పైడర్ మ్యాన్' థీమ్‌తో సెలబ్రేట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ ఫోటో కింద నెటిజన్లు 'RIP' అంటూ కామెంట్స్ పెడుతూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. చిన్నారి సోనార్ష్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లిదండ్రులు ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
