హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఉద్రిక్తత నెలకొంది. రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు పక్కన ఉన్న ఇండ్లు, షాపులను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేవేస్తున్నారు. దీంతో స్థానికులు కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బుధవారం( డిసెంబర్17) అల్విన్ కాలనీ లో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కను ఇండ్లు, షాపులను తొలగించారు. ఈ క్రమంలో అధికారులతో పాటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అక్కడే ఉన్నారు. అయితే తమకు ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తు్న్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే , కార్పొరేటర్ తో దగ్గరుండి కూల్చివేతలు చేయించారని , ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీనితో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. కనీసం తమకు జిహెచ్ఎంసి నుంచినోటీసులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ది పనులకు తాము ఆటంకం కలిగించమని కనీసం సమయంల ఇవ్వకుండా కూల్చివేయడంపై స్థానికులు మండిపడ్డారు. తులసి వనం నుంచి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కావల్సి ఉండగా కొందరి లబ్దికోసం వాటిని మార్చేసి పేదల ఇండ్లను కూలుస్తున్నారని వాపోయారు.
