ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ వార్నింగ్ లేవు కానీ.. అక్కడక్కడ రోడ్లు చీలిపోయాయి

ఇండోనేషియాలో భారీ భూకంపం : సునామీ వార్నింగ్ లేవు కానీ.. అక్కడక్కడ రోడ్లు చీలిపోయాయి

ఇండోనేషియా దేశంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూమి ఊగిపోయింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూ కంపం కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే  ప్రకటించింది. ఇది చాలా శక్తింవంతమైన భూకంపం అని స్పష్టం చేసింది ఈ సర్వే రిపోర్ట్. 

సినాబాంగ్ కు ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో.. సముద్రంలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు ప్రకటించారు అధికారులు. దీని వల్ల ఇండోనేషియాలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తీవ్ర స్థాయిలో భూమి కంపించటంతో.. జనం రోడ్లపైకి వచ్చారు. కొన్ని చోట్ల రోడ్లు చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు. ఎలాంటి సునామీ వార్నింగ్స్ ఇవ్వలేదు అధికారులు. భూకంపం కేంద్రం సముద్రంలో ఉండటంతో.. గతంలో వచ్చిన సునామీ సైతం ఇదే ప్రాంతంలో భూకంపం రావటం వల్లే జరగటంతో.. జనంలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

2026, మార్చి 3వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే టెక్టోనిక్ ప్లేట్లలో భారీ కదలిక వచ్చిందని.. దీని వల్ల 6.1 తీవ్రతతో భూ కంపం వచ్చిందని ప్రకటించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే. ఈ ప్రాంతంలో తరచూ భూ కంపాలు వస్తాయని.. వాటిలో తీవ్రతలో తేడాలు ఉంటున్నాయని వెల్లడించారు అధికారులు.