అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న "అంతులేని యుద్ధాల" నేపథ్యంలో అమెరికా సైనిక శక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అమెరికా వద్ద "వర్చువల్లీ అన్‌లిమిటెడ్" అంటే దాదాపు అపరిమితమైన ఆయుధ సంపత్తి ఉందని చెప్పారు. దీంతో ఏ శక్తినైనా ఎదుర్కోగల సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అమెరికా అనుసరించిన బలహీనమైన విధానాలకు స్వస్తి పలికి, కేవలం శాంతిని స్థాపించడమే కాకుండా.. శత్రువులకు కంటిమీద కునుకు లేకుండా చేసే స్థాయికి అమెరికా రక్షణ వ్యవస్థ చేరుకుందని అన్నారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానంగా మధ్యప్రాచ్యం, ఇతర యుద్ధ ప్రాంతాల్లోని ప్రత్యర్థులను హెచ్చరించేలా ఉన్నాయి. అమెరికా రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచడం, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ టెక్నాలజీ, అణు సామర్థ్యాన్ని ఆధునీకరించడం ద్వారా తాము ప్రపంచంలోనే ఎదురులేని శక్తిగా మారామని ట్రంప్ పేర్కొన్నారు. తమ దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం సంఖ్యలో మాత్రమే కాకుండా.. సాంకేతికతలోనూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉన్నాయని వివరించారు. ఈ అపరిమిత ఆయుధ సంపత్తి అమెరికా ప్రయోజనాలను కాపాడటమే కాకుండా, మిత్రదేశాలకు కూడా కొండంత అండగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే ఈ అన్‌లిమిటెడ్ వెపన్స్ కామెంట్స్ వెనుక ఒక వ్యూహాత్మక హెచ్చరిక కూడా దాగి ఉంది. అమెరికాను తక్కువ అంచనా వేసి యుద్ధాలకు దిగితే, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా ఇరాన్ వంటి దేశాలకు సూచనలు ఇచ్చారు ట్రంప్. కేవలం రక్షణ కోసమే కాకుండా, అవసరమైతే దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధాలను ముగించడమే తన లక్ష్యమని చెబుతూనే, ఆ ముగింపు అమెరికా పైచేయి సాధించేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఆయన చేసిన "ఫైర్ పవర్" కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
