మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల హైదరాబాద్ విమానాశ్రయం నుండి ప్రయాణించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా బాగా పెరిగింది. ఇరాన్ - అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్న ప్రాంతాల మీదుగా విమానాలు వెళ్లడం ప్రమాదకరం కాబట్టి, విమానయాన సంస్థలు ప్రయాణ రూట్లను మార్చేశాయి. దీనివల్ల దూరం పెరిగి ఇంధనం ఎక్కువగా ఖర్చవుతోంది. అలాగే విమానాలు గమ్యస్థానానికి చేరడానికి ఎక్కువ సమయం పడుతోంది. కొన్ని మార్గాల్లో విమానాల సంఖ్య తగ్గడం వల్ల ఉన్న సీట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
యూరప్ విమాన ఛార్జీలు
హైదరాబాద్ నుండి యూరోపియన్ నగరాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. మార్చి 3, మంగళవారం లండన్‌కు వన్-వే టిక్కెట్ ధరలు రూ.65 వేల నుండి రూ.90 వేల మధ్య పలుకుతుంది. ఈ చార్జీలు సాధారణ ఛార్జీ కంటే దాదాపు రెట్టింపు. అదేవిధంగా, జర్మనీలోని నగరాలకు ఛార్జీలు సాధారణ ధరలతో పోలిస్తే 200 నుండి 300 శాతం పెరిగాయి.
హైదరాబాద్ విమానాశ్రయం నుండి అమెరికా ప్రయాణం కూడా ఖరీదైనదిగా మారింది. ఇథియోపియాలోని అడిస్ అబాబా మీదుగా న్యూయార్క్ వెళ్లే విమాన టికెట్ ధర మంగళవారం దాదాపు రూ.1.5 లక్షలుగా నిర్ణయించారు. విమానాల రూటింగ్, ఎయిర్‌స్పేస్ మూసివేతలు ద్వారా సేవల తగ్గింపు కారణంగా, హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణీకుల ప్రయాణ వ్యవధి పెరిగింది.
తీవ్రంగా దెబ్బతిన్న హైదరాబాద్ యుఎఇ కనెక్టివిటీ
హైదరాబాద్ నుండి యుఎఇ మధ్య విమాన కనెక్టివిటీ తీవ్రంగా దెబ్బతిన్నది. హైదరాబాద్ నగరం నుండి యుఎఇ మధ్య రోజుకు సగటున 5వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. విమానయాన సంస్థలు చివరి నిమిషంలో విమానాల రద్దు చేయడం, ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్ నుండి సరైన సమాచారం రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
రూట్లు మార్చడం వల్ల విమానంలో గడపాల్సిన గంటల సంఖ్య పెరిగి ప్రయాణికులు అలసిపోతున్నారు. రాబోయే కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుండి మధ్యప్రాచ్యం, యూరప్, అమెరికాకు ప్రయాణించే ప్రయాణీకుల విమాన ఛార్జీలు చాల అధికంగా ఉండవచ్చు. కాబట్టి ట్రావెల్ ప్లాన్ ఉన్నవారు ముందుగానే టికెట్ ధరలు చూసుకోవడం, విమాన సంస్థల నుండి అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
