- వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నం
- పెళ్లిళ్లు, చావులు, పరామర్శలతో క్యాడర్ వద్దకు..
- కేటీఆర్ స్థానంలో హరీశ్ రావుఎంట్రీపై సర్వత్రా చర్చ
వరంగల్, వెలుగు:ఓరుగల్లు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్‍ఎస్ పార్టీకి ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో.. త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును ముందుపెడ్తున్నారా? అంటే.. అవుననే మాటలే వినపడుతున్నాయి. హరీశ్‌రావు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండుమూడు రోజులకోసారి వరంగల్ సిటీకి వస్తున్నాడు.
ప్రధాన ప్రాజెక్టుల వద్దకెళ్లి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తున్నాడు. కార్యకర్తల ఇండ్లల్లో పెళ్లిళ్లు, చావులు, పరామర్శలకు వెళ్లి పలకరిస్తున్నాడు. దీంతో ఈసారి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍ను కాకుండా హరీశ్ రావుకు గెలుపు బాధ్యతలు అప్పజెబుతున్నారనే చర్చ నడుస్తోంది.
కేటీఆర్ ప్రచారానికొస్తే కలిసిరాలే..
2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓరుగల్లు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. పార్టీ సర్వేల్లో గ్రేటర్ సిటీలోని ఓ నియోజకవర్గంతో పాటు మరో రెండుస్థానాల్లో బీఆర్ఎస్ మాజీలకు పీకల్లోతు వ్యతిరేకత ఉందని తెలిసినా, వారికే టిక్కెట్లు ఇచ్చి మై హూనా.. అంటూ ప్రచారం చేశాడు.
ఓరుగల్లులోని 12 స్థానాల్లో తమ అభ్యర్థులే గెలవబోతున్నారని సర్వేలు తేలాయని చెప్పాడు. తీరాచూస్తే 2 స్థానాల్లో మాత్రమే గెలిచి 10 నియోజకవర్గాలు హస్తం చేతికిచ్చారు. 2 ఓసీ స్థానాలు, మరో ఎస్సీ స్థానంలో గులాబీ మాజీలకు వ్యక్తిగతంగా బలమున్నా.. కేటీఆర్ ప్రచారం తర్వాత అవి ఓటమి కోటాలో పడ్డాయి. ఆ తర్వాత అంతా తానై పని చేసినా 2 పార్లమెంట్ స్థానాల్లోనూ ఓటమి చెందారు.
సర్పంచ్ ఫలితాల్లో డైరెక్ట్ ప్రచారం చేయకున్నా.. తెరవెనుక వేసిన స్కెచ్చులు పారలేదు. ఈ క్రమంలో మొన్నటి ఓరుగల్లు మున్సిపల్ ఎన్నికలను కేటీఆర్ సవాల్‌గా తీసుకున్నారు. ప్రచారం చివరి రెండు రోజులు ఓరుగల్లుకే కేటాయించాడు.
వరుసబెట్టి అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. ‘ఎమ్మెల్యేలను ఓడగొడితే కేసీఆర్ సీఎం అవ్వడనే నిజం తెలియక.. అరూరి రమేశ్ వంటి కొందరు నేతలను జనాలు ఓడించారు’ అని చెబుతూ ప్రచారంలో ప్రజలను తక్కువ చేసి మాట్లాడారు.
దీంతో కేటీఆర్ ప్రచారానికి ముందు రోజు వరకు నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట స్థానాల్లో గెలుస్తుందని భావించగా, ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. కేటీఆర్ ప్రచారం తర్వాతే నెగటివ్ వచ్చిందనే ప్రచారం జరిగింది.
గ్రేటర్ వరంగల్లో కాంగ్రెస్ స్ట్రాంగ్..
ఓరుగల్లు వరుస ఓటములను దగ్గరగా చూస్తే కేటీఆర్ ప్రచారానికి జనాలు పెద్దగా స్పందించడం లేదనే విషయం స్పష్టమవుతోంది. మొదట్లో కాంగ్రెస్ వేవ్ కారణంగా గెలిచాయని చెప్పుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేండ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా సరైన ఫలితాలు రాకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు.
2021 ఏప్రిల్‍లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 66 డివిజన్లకుగానూ బీఆర్‍ఎస్ 48, బీజేపీ 10 , కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఆపై ఇండిపెండెంట్లు, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు సైతం కారు ఎక్కడంతో 54 స్థానాలతో తిరుగులేదనుకున్నారు.
గులాబీ పార్టీ వరుస ఓటములతో అందులో ఉన్న 25 నుంచి 30 మంది హస్తం పార్టీలోకి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, తూర్పులో మంత్రి కొండా సురేఖ మురళి దంపతులు, వర్ధన్నపేటలో కేఆర్.నాగరాజుకు కార్పొరేటర్లను గెలిపించుకునే సత్తా ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ 10 ఏండ్లలో చేయని అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేయించిందనే పరిస్థితి గ్రేటర్‍లో కనిపిస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ గ్రేటర్‍లో బలంగా ఉంది.
బలం పెంచుకోవడంపై నజర్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నరేండ్ల తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఫలితాలు బీఆర్‍ఎస్ భవిష్యత్తును నిర్ధేశించనున్నాయి. దీంతో పార్టీ పెద్దలు హరీశ్‌రావును ముందుపెడ్తున్నట్లు చెబుతున్నారు.
ఈక్రమంలో 9 రోజుల్లో ఆయన మూడుసార్లు గ్రేటర్ వరంగల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీకి జీవంపోసే ప్రయత్నం మొదలుపెట్టారు. గత నెల 20న దేవన్నపేటలోని దేవాదుల పంప్‍హౌజ్ పరిశీలనకు వచ్చి ప్రాజెక్టులపై మాట్లాడారు.
క్యాడర్‍తో ఇంటారాక్ట్ అయ్యారు. పార్టీకి అనుబంధంగా ఉండే వ్యక్తి తల్లి చనిపోగా, పరామర్శకు వెళ్లారు. 24న గ్రేటర్ తూర్పు పరిధిలో సెంట్రల్ జైల్ ఆవరణలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెసాలిటీ హస్పిటల్ పనుల పరిశీలన పేరుతో వచ్చారు. ఎంజీఎం హస్పిటల్ సమస్యలను ప్రస్తావించారు. ఉద్యోగులతో పాటు జర్నలిస్టుల పక్షాన మాట్లాడారు. వరంగల్లో ఓ కార్పొరేటర్ కొడుకు పెళ్లి, హనుమకొండ యాదవనగర్‍లో ఓ దాడి కేసులో జైల్‍కు వెళ్లిన కార్పొరేటర్ ఫ్యామిలీని పరామర్శించారు.
28న మళ్లీ వరంగల్ వచ్చి కాజీపేట ప్రాంతాన్ని ప్రభావితం చేసే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని ఎత్తుకున్నారు. ‘కొలువుల కొట్లాట’ పేరుతో చేపట్టిన మహా ధర్నాలో పాల్గొన్నారు. స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వకుంటే.. కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని అడ్డుకుంటామని వేడి పుట్టించి క్యాడర్‍లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన ప్రతిసారి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు తన కార్యక్రమానికి వచ్చేలా కో ఆర్డినేట్ చేశారు.
