పండుగల వేళ తస్మాత్ జాగ్రత్త..భారీ ఆఫర్ల పేరుతో ఫేక్ లింక్స్..క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతది!

పండుగల వేళ తస్మాత్ జాగ్రత్త..భారీ ఆఫర్ల పేరుతో ఫేక్ లింక్స్..క్లిక్  చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతది!
  • క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టార్గెట్..ఫేక్ లింక్స్ పంపిస్తున్న సైబర్ ఫ్రాడ్ స్టర్లు..తస్మాత్ జాగ్రత !

పండుగల సీజన్ లో సైబర నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రిస్మస్, న్యూఇయర్  సెలబ్రేషన్స్ మూడ్ లో సామాన్యులే  లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. పండుగ ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో సెల్ ఫోన్లకు ఆకర్షణీయమైన మెసేజ్‌లు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ లక్కీ డ్రా  పేరుతో ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. ఈ లింక్స్‌పై క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.

మరోవైపు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ల తరహాలో ఉండే నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి.. కేవలం అతి తక్కువ ధరలకే వస్తువులంటూ ఆశ చూపుతున్నారు. అలాంటి వాటిని నమ్మి ఆర్డర్ చేస్తే  బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ ఫ్రాడ్ స్టర్లు. తక్కువ ధరకే విమాన, బస్సు టికెట్లు ఇస్తామంటూ ఫేక్ ట్రావెల్ వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్స్ చేసుకుని మోసగిస్తున్నారు.

ఫేక్ లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే యూజర్ల వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కుతాయి..కేవలం ఒక్క క్లిక్‌తో సెకన్ల వ్యవధిలోనే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పండుగ ఆఫర్ల లింక్స్ ను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని  ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు.