మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్టార్ట్ అయ్యి చివరికి ఊహించని పతనంలో క్లోజ్ అయ్యాయి. ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. దీనికి తోడు రియల్టీ, మీడియా స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయి. ఇంట్రాడేలో 1350 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సూచీ చివరికి 1068 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక నిఫ్టీ 288 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 217 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 189 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
నిఫ్టీ ఐటీ సూచీ నేడు ఏకంగా 5 శాతం పైగా పడిపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. స్టాక్ మార్కెట్ల వినాశనానికి దారితీసిన 5 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆంథ్రోపిక్ ప్రకంపనలు
AI వల్ల ఐటీ కంపెనీల మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్న భయాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ విడుదల చేసిన 'క్లాడ్ కోడ్' టూల్స్ వల్ల సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ ఖర్చులు భారీగా తగ్గుతాయని వెల్లడించడంతో.. భారత ఐటీ సేవలపై ప్రభావం పడుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
2. ట్రంప్ హెచ్చరికలు - గ్లోబల్ క్యూస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఒప్పందాలపై చేసిన హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లను కుదిపేశాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా అధిక టారిఫ్స్ విధిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా మార్కెట్లు రాత్రికి రాత్రే 2% పతనమవ్వడంతో నేడు ఇండియన్ మార్కెట్లపై కూడా ఒత్తిడి పెంచింది.
►ALSO READ | వెనిజులా, శ్రీలంక జీడీపీ కంటే ఐటీ కంపెనీల నష్టాలే ఎక్కువ.. రూ. 9.44 లక్షల కోట్లు ఆవిరి!
3. డాలర్ జోరు - రూపాయి బేజారు
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం.. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రూపాయి విలువ 90.95 వద్దకు పడిపోయింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై నెలకొన్న అనిశ్చితి కూడా రూపాయిని మరింత బలహీనపరిచింది.
4. క్రూడ్ సెగలు
బ్రెండ్ క్రూడ్ ధర 1% పెరిగి 72.13 డాలర్లకు చేరింది. క్రూడ్ ధరలు పెరిగితే భారత వాణిజ్య లోటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటం మార్కెట్ పతనానికి మరో కారణమైంది.
5. ఎక్స్‌పైరీ ఓలటాలిటీ
మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్‌పైరీ కావడంతో మార్కెట్లో తీవ్ర ఓలటాలిటీ చోటుచేసుకుంది. ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడం లేదా రోల్ ఓవర్ చేయడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి.
