వెనిజులా, శ్రీలంక జీడీపీ కంటే ఐటీ కంపెనీల నష్టాలే ఎక్కువ.. రూ. 9.44 లక్షల కోట్లు ఆవిరి!

వెనిజులా, శ్రీలంక జీడీపీ కంటే ఐటీ కంపెనీల నష్టాలే ఎక్కువ.. రూ. 9.44 లక్షల కోట్లు ఆవిరి!

భారతీయ ఐటీ రంగం ప్రస్తుతం ఒక అనూహ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏఐ సృష్టించిన ప్రకంపనలు, అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన ఖర్చులు వెరసి.. భారత ఐటీ దిగ్గజాల మార్కెట్ విలువను ఆవిరి చేస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో భారతీయ ఐటీ కంపెనీలు కోల్పోయిన సంపద అక్షరాలా 104 బిలియన్ డాలర్లు.. అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.9లక్షల 44 వేల కోట్లు. ఇది వెనిజులా, శ్రీలంక దేశాల మొత్తం జీడీపీ కంటే ఎక్కువన్నమాట.

దేశంలోని 75 టాప్ ఐటీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతేడాది ఫిబ్రవరిలో రూ.38లక్షల 93వేల309 కోట్లుగా ఉండగా.. అది ఇప్పుడు రూ.30లక్షల 32వేల473 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు రూ.8లక్షల 60వేల కోట్ల సంపద ఆవిరైంది. తాజాగా మంగళవారం జరిగిన ట్రేడింగ్‌లో మరో రూ.84వేల కోట్లు నష్టపోవడంతో మొత్తం నష్టం 9లక్షల 44వేల కోట్లకు చేరింది.

ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2026లో వెనిజులా జీడీపీ కేవలం 79.92 బిలియన్ డాలర్లు. ఇక శ్రీలంక 2024 జీడీపీ 98.96 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ మన ఐటీ రంగం ఒక్క ఏడాదిలో కోల్పోయిన సంపద విలువ 104 బిలియన్ డాలర్లని తేలింది. ఇది చూస్తుంటే ఏఐ టెక్ రంగంలోని కంపెనీల పునాదులను పేకమేడల్లా కూల్చేస్తోందని ఇందుకు ఎక్కువ సమయం కూడా పట్టడం లేదనే వాస్తవాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు.

►ALSO READ | 24 గంటల్లో IDFC బ్యాంక్ నుంచి 578 కోట్లు వసూలు చేశాం: హర్యానా సీఎం

నష్టాల విషయానికి వస్తే టెక్ దిగ్గజం టీసీఎస్ 40 బిలియన్ డాలర్లు అంటే రూ.3లక్షల 61వేల465 కోట్లు మార్కెట్ విలువను కోల్పోయి అగ్రస్థానంలో ఉంది. ఇక ఇన్ఫోసిస్ 21 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. విప్రో 10 బిలియన్ డాలర్లు, హెచ్‌సిఎల్ టెక్ 6.50 బిలియన్ డాలర్ల మేర తమ మార్కెట్ విలువను కోల్పోయాయి.

AI భయాలు - కాంట్రాక్టుల రద్దు..
జనరేటివ్ ఏఐ రాకతో ఐటీ సేవల అవసరం తగ్గుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది. 'సిట్రిని రీసెర్చ్' రిపోర్ట్ ప్రకారం.. టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల కాంట్రాక్టుల రద్దు ప్రక్రియ 2027 వరకు కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థ జెఫరీస్ ఐటీ షేర్ల టార్గెట్ ధరలను 33 శాతం మేర తగ్గించాయి. ఏఐ వల్ల పాత పద్ధతుల్లో సాగే మేనేజ్డ్ సర్వీసెస్ తగ్గిపోయి.. కేవలం కన్సల్టింగ్ రంగంపైనే ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది సంక్షోభమా..? అవకాశమా..?
మార్కెట్లు ప్రస్తుతానికి ఏఐ వల్ల కలిగే నష్టాన్ని అతిగా అంచనా వేస్తున్నాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. వాస్తవానికి ఏఐ మోడల్స్ మెరుగుపడుతున్నా, ఐటీ సేవల అవసరం పూర్తిగా పోదని వారు భావిస్తున్నారు. మరోవైపు నోమురా సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ అప్లికేషన్ల తయారీలో భారత్‌కు కొత్త అవకాశాలు వస్తాయని.. ఇది నిర్మాణ రంగ జీడీపీ వృద్ధికి కూడా తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సవాలును మన ఐటీ దిగ్గజాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి.