హర్యానా ప్రభుత్వ ఖాతాల్లో జరిగిన రూ.590 కోట్ల భారీ మోసం గంటల్లోనే పరిష్కారానికి వచ్చింది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ విషయం బయటకు వచ్చి రచ్చరచ్చ అయిన కేవలం 24 గంటల వ్యవధిలోనే పోయిన సొమ్మంతా తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి జమ చేసిందని హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వార్తతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఇన్వెస్టర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి షేరు విలువ సుమారు 1% పెరిగి రూ.70.54 వద్ద ట్రేడ్ అయ్యింది. బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ వి. వైద్యనాథన్ పెట్టుబడిదారులతో మాట్లాడుతూ, ఈ మోసం వల్ల బ్యాంకుపై కొంత ప్రభావం ఉంటుందని, అయితే పరిస్థితిని చక్కదిద్దుతామని భరోసా ఇచ్చారు.
వాస్తవానికి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లోని హర్యానా ప్రభుత్వ ఖాతాల నుంచి రూ.590 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగులు, బయటి వ్యక్తులు కుమ్మక్కై ఈ భారీ మోసానికి పాల్పడ్డారట. ఈ వార్తతో సోమవారం మార్కెట్లలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 20% లోయర్ సర్క్యూట్‌ను తాకి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అయితే సీఎం చేసిన ప్రకటనతో స్టాక్ తిరిగి లాభాల్లోకి రావటం విశేషం.
సీఎం సైనీ కీలక ప్రకటన..
మంగళవారం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి సైనీ స్పందిస్తూ.. ప్రభుత్వ విభాగానికి చెందిన పూర్తి సొమ్ము తిరిగి మా ఖాతాల్లో జమ అయ్యింది. వడ్డీ రూపంలో వచ్చిన రూ.22 కోట్లతో కలిపి మొత్తం రూ.578 కోట్లకు పైగా నిధులు కేవలం 24 గంటల్లోనే రికవరీ అయ్యాయని వెల్లడించారు.
►ALSO READ | స్టాక్ మార్కెట్లను షేక్ చేస్తున్న సిట్రిని రీసెర్చ్ రిపోర్ట్.. అందులో ఏమి ఉందంటే..?
చండీగఢ్‌లోని బ్యాంక్ బ్రాంచ్‌కు చెందిన మిడ్ అండ్ లోయర్ లెవెల్ ఉద్యోగులు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని బ్యాంకు యాజమాన్యం ధృవీకరించినట్లు ఆయన తెలిపారు. బ్యాంకు ఉద్యోగులైనా, ప్రైవేట్ వ్యక్తులైనా, చివరకు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని సైనీ స్పష్టం చేశారు. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపేందుకు హర్యానా ప్రభుత్వం యాంటీ కరప్షన్ బ్యూరోను రంగంలోకి దించింది. ఫైనాన్స్ సెక్రటరీ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, కేవలం ఒక్క రోజులోనే నిధులను వెనక్కి తెప్పించడం చర్చనీయాంశమైంది.
