ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఒకటే చర్చ.. అదే 'సిట్రిని రీసెర్చ్' రిపోర్ట్ గురించే. 'ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్' పేరుతో విడుదలైన ఈ స్టడీ.. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇది భవిష్యత్తుపై చేసిన అంచనా కాదు. ఒకవేళ AI గనుక ప్రస్తుత వేగంతో దూసుకెళ్తే 2028 నాటికి ప్రపంచం ఎలా ఉంటుందో వివరిస్తూ చేసిన ఒక థాట్ ఎక్సర్సైజ్. దీని ప్రభావంతో అమెరికాలో ఐబీఎం షేర్లు గత 25 ఏళ్లలో చూడనంత పతనాన్ని చవిచూడగా.. మన దేశంలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా మరిన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో మంగళవారం భారీగా నష్టపోయాయి.
భారత ఐటీ రంగానికి ముప్పు..?
ఈ రిపోర్ట్ భారత్ గురించి అత్యంత భయంకరమైన అంచనాలను బయటపెట్టింది. తక్కువ ఖర్చుతో సేవలు అందించడంపై ఆధారపడిన ఇండియన్ ఐటీ రంగాన్ని ఏఐ పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పింది. 2027 నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల కాంట్రాక్టులు రద్దు కావడంలో స్పీడ్ పెరుగుతుందని, 2028 నాటికి భారత్ తన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి IMF సహాయం కోరాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోవడంతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే నాలుగు నెలల్లోనే 18 శాతం పడిపోవచ్చని అంచనా వేసింది.
వైట్ కాలర్ లేఆఫ్స్:
ఈ రిపోర్ట్ ప్రకారం.. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ కోడింగ్ అనేది దాదాపు ఉచితంగా మారుతుంది. దాదాపుగా అది పవర్ బిల్లుకు సమానంగా మారిపోనుందట ఏఐ వల్ల. దీనివల్ల మధ్య స్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా వైట్ కాలర్ వర్కర్లు భారీగా ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఏఐ వల్ల కొత్తగా ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ సేఫ్టీ రీసెర్చర్స్ వంటి ఉద్యోగాలు వస్తాయి కానీ.. అవి పోయిన ఉద్యోగాల కంటే చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. పైగా పాత ఉద్యోగాలతో పోలిస్తే కొత్త ఉద్యోగాల జీతాలు చాలా తక్కువగా ఉండొచ్చని రిపోర్ట్ అభిప్రాయపడింది.
ఏఐ ట్యాక్స్ పరిష్కారమా..?
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రిపోర్ట్ తయారు చేసిన రచయితల్లో ఒకరైన అలాప్ షా ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. కంపెనీలకు ఏఐ వల్ల వచ్చే భారీ లాభాలపై ప్రభుత్వాలు 'ఏఐ ట్యాక్స్' విధించాలని కోరారు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రజల వల్ల వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు.. ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సోషల్ సెక్యూరిటీ పథకాలకు వాడుకోవాలని అన్నారు.
అసలు ఇది నిజంగా జరిగే ఛాన్స్ ఉందా..?
అయితే ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ రిపోర్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చికాగో బూత్ ప్రొఫెసర్ అలెక్స్ ఇమాస్ వంటి నిపుణులు.. ఈ అంచనాలు మరీ అతిగా ఉన్నాయని కొట్టిపారేస్తున్నారు. మనుషులకు పని పూర్తిగా మాయమవడం, ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలు ఒకేసారి జరగడం అసాధ్యమని వాదిస్తున్నారు. ఏది ఏమైనా.. ఏఐ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడున్న స్థాయి నుంచి తలకిందులు చేయబోతోందన్నది రిపోర్ట్ నుంచి అర్థం చేసుకోవచ్చు.
