అసాన్ (కొరియా): భారత షట్లర్ అష్మిత చలిహా అదరగొట్టింది. కొరియా మాస్టర్స్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుని కెరీర్‌లో తొలి బీడబ్ల్యేఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అస్సాంకు చెందిన 26 ఏళ్ల అష్మిత.. చైనా నాలుగో సీడ్, వరల్డ్ నంబర్–35 హాన్ కియాన్ షిపై 14–21, 21–14, 21–14తో సంచలన విజయం సాధించింది. 53 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లు నెగ్గింది.
తొలి గేమ్‌లో అష్మిత 3–0, ఆ తర్వాత 9–5తో ఆధిక్యంలోకి వెళ్లినా హాన్ పుంజుకుంది. 11–11తో స్కోరు సమమైన తర్వాత వరుస పాయింట్లతో దూసుకెళ్లి 21–14తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో అష్మిత తన వ్యూహాన్ని మార్చింది. పవర్‌ఫుల్ స్మాష్‌లు, మెరుగైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఇంటర్వెల్‌కు 11–8తో ముందంజలో నిలిచి, ఆ తర్వాత 17–10 ఆధిక్యం సాధించింది. చివరకు 21–14తో గేమ్ నెగ్గి మ్యాచ్‌ను డిసైడర్‌కు తీసుకెళ్లింది.
మూడో గేమ్‌లో ఇంటర్వెల్ సమయానికి అష్మిత 9–11తో వెనుకబడింది. కానీ కోచ్ పార్క్ టే-సాంగ్ సూచనలతో మరింత దూకుడుగా ఆడింది. వరుస స్మాష్‌లతో 12–11తో ఆధిక్యంలోకి వచ్చి.. 15–11, 19–14తో పట్టుబిగించింది. చివరకు హాన్ రిటర్న్ వైడ్‌గా వెళ్లడంతో అష్మిత చాంపియన్‌గా అవతరించింది.
2024 కొరియా ఓపెన్‌లో అష్మిత కుడి మోకాలికి తీవ్ర గాయమైంది. శస్త్రచికిత్స, సుదీర్ఘ రిహాబిలిటేషన్ తర్వాత తిరిగి కోర్టులోకి వచ్చిన ఆమె.. ఈ ఏడాది చైనా, మలేసియా మాస్టర్స్‌లో క్వార్టర్స్, మకావు ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. ఇప్పుడు కొరియా మాస్టర్స్ టైటిల్‌తో తన కమ్‌బ్యాక్‌ను చిరస్మరణీయం చేసుకుంది. గత ఆదివారం తాన్వీ శర్మ తైపీ ఓపెన్ గెలవగా.. వరుసగా రెండో వారం భారత షట్లర్ BWF వరల్డ్ టూర్ టైటిల్ సాధించడం విశేషం.
