ఇన్సూరెన్స్ ఏజెంట్ల కమీషన్‌కు కోత..! పాలసీహోల్డర్లకు మేలే..   కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసిన IRDA

ఇన్సూరెన్స్ ఏజెంట్ల కమీషన్‌కు కోత..! పాలసీహోల్డర్లకు మేలే..   కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసిన IRDA
  • వీటిపై వచ్చే నెల 25 వరకు ప్రజలు తమ ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ ఇవ్వొచ్చు
  • 34 శాతం పడ్డ పాలసీ బజార్‌‌‌‌‌‌‌‌ పేరెంట్ కంపెనీ షేర్లు 

న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  సామాన్యులకు ఊరటనిచ్చేలా, పారదర్శకతను పెంచేలా  ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ) కొత్త సంస్కరణలను ప్రకటించింది.  ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌,  ఏజెంట్ల కమీషన్లు,  యూజర్ల ప్రైవసీ వంటి అంశాలపై కీలక ప్రతిపాదనలతో కూడిన ‘కన్సల్టేషన్ పేపర్’ను విడుదల చేసింది. ఈ ముసాయిదాపై వచ్చే నెల 25 వరకు ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు. 

ఈ ప్రతిపాదనల దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు, వీటితో పాటు పాలసీలు అమ్ముతున్న బ్యాంకుల షేర్లు భారీగా పడుతున్నాయి.  పాలసీ బజార్  పేరెంట్ కంపెనీ పీబీ ఫిన్‌‌‌‌టెక్ షేర్లు గత 5 సెషన్లలో 34 శాతం క్రాష్ అయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.30 వేల కోట్ల మేర తగ్గింది. 

ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ప్రైవసీకి పెద్ద పీట  

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో లేదా వివిధ పోర్టల్స్‌‌‌‌లో ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీ ప్రీమియం ఎంత అవుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రీమియం కోట్ చూడాలన్నా పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ ఇవ్వాల్సి వస్తోంది. ఆ వివరాలు నమోదు చేయగానే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ల నుంచి నిరంతరాయంగా విసిగించే కాల్స్ (స్పామ్ కాల్స్) వస్తున్నాయి. 

ఈ విధానాన్ని వినియోగదారుల హక్కులను దెబ్బతీసే ‘డార్క్ ప్యాటర్న్స్’ గా ఐఆర్‌‌‌‌డీఏఐ తీవ్రంగా పరిగణించింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, కస్టమర్ నుంచి ఎలాంటి వ్యక్తిగత వివరాలు (మొబైల్ నంబర్, ఈ–మెయిల్) తీసుకోకుండానే కంపెనీలు, వెబ్‌‌‌‌సైట్లు తమ ప్రొడక్ట్‌‌‌‌లు, ఫీచర్లు, ప్రీమియం ధరల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలి. 

కమీషన్లపై పరిమితులు 

2023లో కంపెనీల విచక్షణకే వదిలేసిన కమీషన్ల విధానాన్ని సవరిస్తూ, పాలసీ రకం ఆధారంగా  కమీషన్‌‌‌‌ పరిమితులను మళ్లీ అమల్లోకి తేవాలని ఐఆర్‌‌‌‌డీఏఐ ప్రతిపాదించింది.  లైఫ్ ఇన్సూరెన్స్ (10 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితి) ఉంటే  మొదటి ఏడాది విక్రయ సంస్థలకు (ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లు, బ్రోకర్లు) గరిష్టంగా 20శాతం, వ్యక్తిగత ఏజెంట్లకు 25శాతం కమీషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. 

హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌  అయితే  మొదటి ఏడాది సంస్థలకు 15శాతం, వ్యక్తిగత ఏజెంట్లకు 20శాతం లిమిట్‌‌‌‌ పెట్టింది.  కొత్త వాహనాల విక్రయాలపై మధ్యవర్తి సంస్థలకు ఎలాంటి కమీషన్ ఉండదు. వ్యక్తిగత ఏజెంట్లకు మాత్రమే కొంత మొత్తం లభిస్తుంది. ‘రెన్యూవల్స్’కు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో పాలసీలు అమ్మే ఏజెంట్లకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని ప్రతిపాదించింది. 

లోన్‌‌‌‌ తీసుకుంటే ఇన్సూరెన్స్ అంటగట్టొద్దు!

 బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఇచ్చేటప్పుడు కస్టమర్లను బెదిరించి లేదా తప్పనిసరి చేసి ఇన్సూరెన్స్ పాలసీలను అంటగట్టే విధానానికి  చెక్ పెట్టనున్నారు. లోన్ ఖర్చులు వేరు, ఇన్సూరెన్స్ ప్రీమియం వేరు అని స్పష్టంగా విడదీసి చూపించాలి. ఫలానా కంపెనీ పాలసీనే తీసుకోవాలని బలవంతం చేయకూడదు. బయట మార్కెట్లో నచ్చిన పాలసీని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ కస్టమర్‌‌‌‌కు ఉండాలి. 

తప్పుడు పాలసీలు అమ్మితే అంతే

పాలసీ ప్రయోజనాల గురించి అబద్ధాలు చెప్పి, నిబంధనలను దాచిపెట్టి అమ్మే ఏజెంట్లపై ఉక్కుపాదం మోపనున్నారు. ప్రతి పాలసీ పేపర్‌‌‌‌‌‌‌‌పై దాన్ని విక్రయించిన నిర్దిష్ట ఏజెంట్ లేదా ఉద్యోగి గుర్తింపు వివరాలు తప్పనిసరిగా ఉండాలి. తప్పుదోవ పట్టించి అమ్మినట్లు రుజువైతే ఏజెంట్ నుంచి ఇచ్చిన కమీషన్‌‌‌‌ను వెనక్కి తీసుకునే అధికారం  కంపెనీలకు ఉంటుంది.  

మరోవైపు సామాన్యులందరికీ ఒకేచోట అన్ని రకాల పాలసీలు లభించేలా, సరిపోల్చి చూసుకునేలా యూపీఐ తరహాలో ‘భీమా సుగమ్’ అనే పబ్లిక్ డిజిటల్ మార్కెట్‌‌‌‌ప్లేస్‌‌‌‌ను ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ విస్తరించనుంది. దీంతో మధ్యవర్తుల బెడద లేకుండా నేరుగా పాలసీలు కొనుగోలు 
చేసుకోవచ్చు.