రియాద్: పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో అల్ నసర్ జట్టులోకి రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో స్పెయిన్ చేతిలో రౌండ్ ఆఫ్–16లో పోర్చుగల్ నిష్క్రమించిన తర్వాత రొనాల్డో రెస్ట్‌లో ఉన్నాడు. 41 ఏళ్ల స్టార్‌ను వెంటనే బరిలోకి దింపకుండా మరికొంత రెస్ట్ తీసుకోవాలని కోచ్ ఏంజ్ పోస్టెకోగ్లూ నేతృత్వంలోని అల్ నసర్ కోచింగ్ స్టాఫ్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో సౌదీ ప్రొ లీగ్‌లో అల్ ఫతేహ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో పాటు కింగ్స్ కప్‌లో అల్ దిరియాతో పోరుకు కూడా రొనాల్డో దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఆగస్టు 21న అల్ రియాద్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు తిరిగి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అల్ నసర్ ఆగస్టు 5న లిస్బన్‌లో ప్రీ-సీజన్ క్యాంప్‌ను ముగించుకుని రియాద్‌కు చేరుకుంది. మరోవైపు రొనాల్డో తన దీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగేజ్‌ను వివాహం చేసుకోనున్నాడనే ప్రచారం జోరందుకుంది.
అయితే ఈ వార్తలను రొనాల్డో కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. పెళ్లిపై రొనాల్డో లేదా జార్జినా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని అతడి సోదరి ఎల్మా అవెయిరో స్పష్టం చేసింది.
