ఐపీఓల్లో తగ్గిన రిటైల్ జోష్‌‌.. లిస్టింగ్ రోజు లాభాలు ఎక్కువగా లేకపోవడమే కారణం..

ఐపీఓల్లో తగ్గిన రిటైల్ జోష్‌‌.. లిస్టింగ్ రోజు లాభాలు ఎక్కువగా లేకపోవడమే కారణం..
  • హై వాల్యుయేషన్స్‌‌తో వస్తున్న కంపెనీలు 
  • మూడేళ్ల లాభాలు లెక్కించి ఐపీఓ ధరల నిర్ణయం
  • ఓఆఫ్‌‌ఎస్‌‌ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న ప్రమోటర్లు

ముంబై: స్టాక్ మార్కెట్‌‌లో ఐపీఓల జోరు పెరిగినప్పటికీ, సాధారణ రిటైల్‌‌ ఇన్వెస్టర్లు మాత్రం అచితూచి అడుగులేస్తున్నారు. ఒకప్పుడు ఐపీఓ అనగానే లిస్టింగ్ రోజునే భారీ లాభాలు  వస్తాయనే ఆశతో కళ్ళుమూసుకుని బిడ్లు వేసిన చిన్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు కంపెనీల వాల్యుయేషన్స్‌‌, క్వాలిటీ వంటివి  చూసి మాత్రమే పెట్టుబడులు పెడుతున్నారు.  వాటాలమ్మే  ప్రమోటర్లకు డబ్బు ఇవ్వడానికి  సిద్ధంగా లేరని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రికార్డు ఐపీఓలున్నా..

స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో ఈ ఏడాది  అత్యధికంగా జులైలో 12 కంపెనీలు రూ. 28,646 కోట్ల నిధులను ఐపీఓల ద్వారా సేకరించాయి. జూన్‌‌లో కేవలం 7 కంపెనీలు రూ. 2,718 కోట్లు మాత్రమే సేకరించాయి.  అయితే ఐపీఓల సంఖ్య పెరిగినా రిటైల్‌‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి.  జులైలో వచ్చిన 12 ఐపీఓలలో కేవలం 5 కంపెనీల రిటైల్‌‌ కోటా మాత్రమే రెండంకెల స్థాయిలో  సబ్‌‌స్క్రయిబ్ అయ్యింది. 6 కంపెనీలకు ఒక అంకె స్థాయిలోనే స్పందన లభించింది. 

ఈ ఏడాది ఎస్‌‌బీఐ ఫండ్ మేనేజ్‌‌మెంట్ (రూ. 9,812 కోట్లు) తర్వాత రెండో అతిపెద్ద ఐపీఓగా వచ్చిన 'మణిపాల్ హెల్త్ ఎంటర్‌‌ప్రైజెస్' (రూ. 9,275 కోట్లు) రిటైల్‌‌ విభాగం పూర్తిగా సబ్‌‌స్క్రయిబే కాలేదు.  రిటైల్‌‌ కోటా కేవలం 93 శాతమే సబ్‌స్క్రిప్షన్ సాధించింది. ఈ కంపెనీ లిస్టింగ్ రోజు 11శాతం లాభం ఇచ్చింది. ఎస్‌‌బీఐ ఫండ్ మేనేజ్‌‌మెంట్ ఐపీఓ రిటైల్‌‌ కోటా 4 రెట్లు సబ్‌‌స్క్రయిబ్ అవ్వగా, లిస్టింగ్ రోజు 7 శాతం లాభపడింది.

మారిన ఇన్వెస్టర్ల వైఖరి

రిటైల్‌‌ ఇన్వెస్టర్లు ప్రధానంగా లిస్టింగ్ రోజు వచ్చే భారీ లాభాల కోసమే ఐపీఓలలోకి వస్తుంటారని మార్కెట్ ఎనాలసిస్‌‌ కంపెనీ ప్రైమ్ డేటాబేస్  మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్దియా తెలిపారు.  2024లో ఐపీఓల సగటు లిస్టింగ్ లాభం 27 శాతం ఉండగా, 2026 నాటికి అది కేవలం 8 శాతానికి పడిపోయిందని వివరించారు. ఫలితంగా  సగటు ఐపీఓ అప్లికేషన్ల సంఖ్య 2024లోని 18.86 లక్షల నుంచి 2026 నాటికి 9.85 లక్షలకు తగ్గిందన్నారు. 

మరోవైపు కంపెనీలు, మర్చంట్ బ్యాంకర్లు రాబోయే మూడేళ్ల లాభాలను ముందే అంచనా వేసి షేరు ధరలను  చాలా ఎక్కువగా నిర్ణయిస్తున్నాయని, దీంతో ఇన్వెస్టర్లు  లాభపడేందుకు ఎలాంటి మార్జిన్ మిగలడం లేదని మోనార్క్ నెట్‌‌వర్త్ క్యాపిటల్ సీఈఓ గౌరవ్ భండారీ తెలిపారు.  

మార్కెట్ అనిశ్చితి, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్‌‌) ద్వారా తమ వాటాలను విక్రయించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటంతో  కూడా రిటైల్‌‌ ఇన్వెస్టర్లు ఐపీఓలకు దూరంగా ఉంటున్నారని పీఎల్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ ఉదయ్ పాటిల్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కంపెనీల దీర్ఘకాలిక భవిష్యత్తును విశ్లేషించుకుని మాత్రమే ముందడుగు వేయాలని సలహా ఇచ్చారు. 

గత ఐదేళ్లలో ఐపీఓల  లిస్టింగ్ రోజు సగటు లాభం

ఆర్థిక సంవత్సరం    ఐపీఓలు    లాభం

2022–23                           37        9 శాతం
2‌‌‌‌‌‌‌‌023–24                           76        27 శాతం
20‌‌‌‌24–25                            79        28 శాతం 
2‌‌‌‌025–26                            112       8 శాతం
2‌‌‌‌‌‌‌‌026–27 (ప్రస్తుతం)         18         12 శాతం