సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్..హైదరాబాద్లో 40 శాతం మందికి ఫ్యాటీ లివర్

సైలెంట్ కిల్లర్..  ఫ్యాటీ లివర్..హైదరాబాద్లో 40 శాతం మందికి ఫ్యాటీ లివర్
  • హైదరాబాద్​లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి సమస్య 
  • సిటీలో 40 శాతం మందికి ఫ్యాటీ లివర్
  • బాధితుల్లో 50 శాతం పురుషులు, 33 శాతం మహిళలు
  • మందు ముట్టకపోయినా ముప్పు.. సన్నగా ఉన్నోళ్లనూ వదలదు
  • బిర్యానీలు, జంక్ ఫుడ్, సిట్టింగ్ జాబులతో రిస్క్
  • సీఎస్ఐఆర్ స్టడీలో షాకింగ్ నిజాలు

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్  బిర్యానీ లవర్స్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్  ఇంజినీర్లు, ఆఫీసుల్లో కుర్చీలకు అతుక్కుపోయే ఉద్యోగులూ.. జర భద్రం! మీరు  మందు జోలికి పోకపోయినా, ఎక్కువ బరువు లేకపోయినా... మీ లివర్ మాత్రం డేంజర్ జోన్​లోకి వెళిపోతున్నది. గుండెపోటు, క్యాన్సర్లే కాదు.. ఇప్పుడు సైలెంట్ కిల్లర్​గా లివర్  సమస్యలు ముంచుకొస్తున్నాయి.  మన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని తాజా స్టడీలో తేలింది. కౌన్సిల్  ఆఫ్  సైంటిఫిక్  అండ్  ఇండస్ట్రియల్  రీసెర్చ్ (సీఎస్ఐఆర్) చేపట్టిన ‘ఫినోమ్ ఇండియా’ ప్రాజెక్టులో గుండె, ఫ్యాటీ లివర్ కు సంబంధించి ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. వైద్య పరిభాషలో దీన్ని మెటబాలిక్  డిస్‌‌‌‌‌‌‌‌ ఫంక్షన్ అసోసియేటెడ్  స్టీటోటిక్  లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) అంటారు. సీఎస్ఐఆర్  శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా హైదరాబాద్  సహా 27 సిటీల్లో సర్వే చేశారు. 10 వేల మందికి పైగా సాంపిల్స్  సేకరించి, అందులో 7,764 మందిని క్షుణ్ణంగా చెక్  చేశారు. దేశవ్యాప్తంగా సగటున 39 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటే.. హైదరాబాద్  లాంటి మెట్రో సిటీల్లో ఇది మరీ ఎక్కువగా 37 శాతం నుంచి 42 శాతం మధ్యలో ఉంది. అంటే మన పక్కన ఉన్న ప్రతి ఐదుగురిలో ఇద్దరికి లివర్‌‌‌‌‌‌‌‌ లో కొవ్వు పేరుకుపోయింది. ఇందులో మగాళ్లే ఎక్కువ. పురుషుల్లో ఈ సమస్య 50 శాతం ఉంటే, మహిళల్లో 33 శాతంగా నమోదైంది.

ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ.. కండ పెంచుకోవాలి

సన్నగా ఉండి, పొట్ట దగ్గర మాత్రమే కొవ్వు ఉండే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని లీన్  ఫ్యాటీ లివర్  అంటున్నారు. ఆసియా దేశాల్లో ముఖ్యంగా మన దగ్గర ఇలాంటి బాధితులు పెరుగుతున్నారు. బాడీలో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ విసెరల్ ఫ్యాట్ (పొట్టలోని అవయవాల చుట్టూ ఉండే కొవ్వు) దీనికి కారణమని శాస్త్రవెత్తలు చెబుతున్నారు. వీళ్లు సన్నగా కనిపించినా.. లోపల లివర్, పేగుల చుట్టూ ప్రమాదకరమైన కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. మనం తినే తిండిలో బియ్యం, పిండి పదార్థాలు ఎక్కువై, బాడీలో కండరాలు కరిగిపోవడమే దీనికి అసలు కారణం. అందుకే బరువు తక్కువగా ఉన్నామని సంబరపడకుండా.. రైస్  తగ్గించి, ప్రోటీన్ ఫుడ్ తింటూ, కండ పెంచే వ్యాయామాలు చేస్తేనే ఈ ముప్పు నుంచి బయటపడతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్త పడకపోతే ప్రమాదమే... 

లివర్‌‌‌‌‌‌‌‌ లో కొవ్వు చేరడం అనేది మొదటి దశ. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమే. అందుకే బరువు అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. బియ్యం, స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్  తగ్గించాలి. వారానికి 5 రోజులు 45 నిమిషాలు బ్రిస్క్ వాక్, వ్యాయామం చేయాలి. 35 ఏళ్లు దాటిన వారు లివర్  ఫంక్షన్  టెస్ట్ తో పాటు అల్ట్రాసౌండ్  స్కానింగ్ చేయించుకోవాలి. ఎర్లీగా గుర్తిస్తే లైఫ్ స్టైల్  మార్పులతో లివర్‌‌‌‌‌‌‌‌ను తిరిగి సెట్  చేసుకోవచ్చు. 

బిర్యానీ, సిట్టింగ్ జాబులే విలన్లు

ఒకప్పుడు మందు తాగితేనే లివర్  చెడిపోతుండేది. కానీ ఇప్పుడు సీన్  మారింది. మనం తినే తిండి, చేసే పనే కొంపముంచుతోంది. సిటీల్లో బిర్యానీ కల్చర్, జంక్ ఫుడ్  లివర్‌‌‌‌‌‌‌‌ కు ఎసరు పెడుతున్నాయి. దానికి తోడు గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరిగిపోతోంది. బరువు ఎక్కువగా ఉన్నవారిలో ముఖ్యంగా పొట్ట ఉన్నవారిలో ఈ జబ్బు వచ్చే చాన్స్ 2.6 రెట్లు ఎక్కువ అని స్టడీలో తేలింది. అలాగే స్టడీలో పాల్గొన్న డయాబెటీస్  రోగుల్లో ఏకంగా 66.4 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉందని తేలింది. వీరిలో లివర్  ఫైబ్రోసిస్  రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్యాటీ లివర్  ఉన్నవారిలో 6.3 శాతం మందికి అప్పటికే లివర్  గట్టిపడే సమస్య మొదలైంది. ఇది ముదిరితే సిర్రోసిస్, లివర్  క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు దారితీసే ప్రమాదం ఉందని స్టడీ హెచ్చరించింది.