అంగన్వాడీ టీచర్లకు స్పెషల్ క్లాసులు..ప్రీ స్కూల్ టీచర్లుగా అప్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్ కు సర్కార్ ప్లాన్

అంగన్వాడీ టీచర్లకు స్పెషల్ క్లాసులు..ప్రీ స్కూల్ టీచర్లుగా అప్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్ కు సర్కార్ ప్లాన్
  • తొలుత 17 వేల మందికి సర్టిఫికెట్ కోర్సు
  • ప్రీ-స్కూల్ టీచర్లుగా అప్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్ చేసేందుకు సర్కార్ ప్లాన్
  • ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న 17 వేల మందికి ఫస్ట్ ప్రయారిటీ
  • అజీం ప్రేమ్ జీ వర్సిటీతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: అంగన్​వాడీలు కేవలం ఆయాలు చూసుకునే కేంద్రాలుగా కాకుండా.. కార్పొరేట్ ప్లే స్కూళ్లకు దీటుగా మారబోతున్నాయి. చిన్న పిల్లలకు ఆటపాటలతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రేంజ్ లో చదువు చెప్పేందుకు అంగన్​వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఏదో మొక్కుబడి ట్రైనింగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు కాకుండా.. ఇకపై పక్కా ప్రొఫెషనల్ గా సర్టిఫికేట్ కోర్సు నేర్పించేందుకు సోమవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ముందుగా 17 వేల మందికి చాన్స్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం ప్రకారం.. అంగన్​వాడీ టీచర్లను ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (పీఎస్ఈ) టీచర్లుగా అప్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35వేలకు పైగా.. అంగన్ వాడీ టీచర్లు ఉండగా.. అందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న సుమారు 17,600 మంది అంగన్​వాడీ టీచర్లను గుర్తించారు. మొదట ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి ఈ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) సిలబస్ కింద ఈ శిక్షణ ఉంటుంది. దీని ద్వారా పిల్లల మానసిక వికాసం, వారికి సులువుగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పడంపై పట్టు సాధించనున్నారు.

6 నెలలు... 30 గంటల ట్రైనింగ్... 

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్ల స్కిల్స్ పెంచి, వాళ్లను కార్పొరేట్ రేంజ్‌‌‌‌‌‌‌‌లో తీర్చిదిద్దేందుకే అజీమ్ ప్రేమ్ జీ వర్సిటీతో కలిసి ఈ 6 నెలల స్పెషల్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సును డిజైన్ చేశారు. ఇందులో 30 గంటల ఆన్‌‌‌‌‌‌‌‌ లైన్ క్లాసులు, ఆరు రోజుల పాటు డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటది.

 ముఖ్యంగా మూడు నుంచి ఆరేండ్ల పిల్లలను స్కూళ్లకు పంపడానికి ఎలా సిద్ధం చేయాలి? వాళ్లకు బోర్ కొట్టకుండా ఆటపాటలతోనే చదువు ఎట్లా నేర్పాలి? అనే టెక్నిక్స్ మీద టీచర్లకు ఈ కోర్సులో నేర్పిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయితే మన అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లు కూడా ప్లే స్కూళ్ల మాదిరి మారనున్నాయి.