TMC ఓటమికి ఈ నాలుగే ప్రధాన కారణాలు.. దీదీ ఓటమిపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

TMC ఓటమికి ఈ నాలుగే ప్రధాన కారణాలు.. దీదీ ఓటమిపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

కోల్‎కతా: 2026 వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల పాటు బెంగాల్‎ను తన కనుసైగలతో పాలించిన దీదీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి బెంగాల్ గడ్డపై బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. 

కానీ టీఎంసీ ఘోర పరాజయానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయంటున్నారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అవినీతి, దుష్పరిపాలన, ముస్లిం సమాజానికి ద్రోహం చేయడం వంటివి టీఎంసీ ఓటమికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. మమతా ప్రభుత్వం ప్రజల సమస్యలకు దూరమై, ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.

అవినీతి

టీఎంసీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు నిరంతరం కొనసాగాయన్నారు. అవినీతి కేసులు ప్రజాగ్రహాన్ని మరింత పెంచాయని, ఈ భావనే ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించిందని అభిప్రాయపడ్డారు.

దుష్పరిపాలన

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ బలహీనంగా మారిపోయిందని.. ప్రజల అంచనాలను అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

ముస్లిం సమాజానికి ద్రోహం

ముస్లిం సమాజానికి ద్రోహం చేయడం టీఎంసీ ఓటమి గల కారణాల్లో ప్రధానమైనదని అన్నారు. బెంగాల్‌లో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం వారి సమస్యలు, అవసరాలపై తగినంత శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. 

టీఎంసీ హయాంలో ముస్లిం సమాజానికి ద్రోహం జరిగిందని... వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోలేదన్నారు. టీఎంసీనే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూడవద్దని కోరారు. సమాన హక్కులు గల పౌరులుగా వారిని గౌరవించాలన్నారు. 

ఎస్ఐఆర్

బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓటమికి ఎస్ఐఆర్ కూడా ఒక ప్రధాన కారణమని అన్నారు. ఈ సమస్య ప్రజాగ్రహాన్ని సృష్టించి.. అది ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిందన్నారు. ఈ నాలుగు అంశాలే టీఎంసీ ఓటమికి ప్రధాన కారణాలయ్యాయని ఒవైసీ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రజలకు పూర్తిగా దూరమయ్యారని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో దీదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.