టీవీ చూస్తున్నప్పుడో, ఖాళీగా కూర్చున్నప్పుడో, లేదా ఫోన్ చూస్తున్నప్పుడో మీకు తెలియకుండానే మీ వేలు ముక్కులోకి వెళ్ళిపోతుందా..? అయితే ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి... మీరు ఒంటరి కాదు ! లోపలపైన అందరూ చేసే పనే ఇది, కాకపోతే బయటకు ఒప్పుకోరంతే.
మెడికల్ భాషలో ఈ అలవాటును రైనోటిల్లెక్సిస్ (Rhinotillexis) అంటారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా ఈ పనిని తెగ చేస్తుంటారని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. సాధారణంగా ఇది పెద్ద హానికరం కాకపోయినా... అతిగా చేస్తే మాత్రం ముక్కులో ఇన్ఫెక్షన్లు రావడం, రక్తం కారడం లాంటి సమస్యలు తప్పవు. అసలు ఈ ముక్కులో వేలు పెట్టే అలవాటు ఎందుకు వస్తుంది ? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి ? దీన్ని ఎలా వదిలించుకోవాలో చూద్దామా...
ముక్కులో వేలు ఎందుకు పెడతారంటే
దీనికి ఒక్కోక్కరిది ఒక్కో రీజన్. అందులో ముఖ్యమైనవి... ఏసీ రూముల్లో ఎక్కువసేపు ఉండటం వల్ల లేదా కాలుష్యం వల్ల ముక్కు లోపల భాగం పొడిబారిపోతుంది. దాంతో లోపల నసికలు కడతాయి. వాటిని క్లీన్ చేయడానికి చేతులు ఆటోమేటిక్‌గా ముక్కు వైపు వెళ్తాయి. సైనస్, అలర్జీ లేదా జలుబు చేసినప్పుడు కూడా ముక్కులో ఒకలాంటి దురద, చికాకు పుడుతుంది. దాంతో కాస్త ఉపశమనం కోసం గిల్లుకుంటూ ఉంటారు.
కొందరికి గోళ్లు కొరకడం, జుట్టుతో ఆడుకోవడం ఎలాగో.. ముక్కులో వేలు పెట్టడం కూడా అంతే. ఏదైనా సీరియస్‌గా ఆలోచిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు వాళ్లకే తెలియకుండా వేలు ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే లైఫ్‌లో ఏదైనా ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నప్పుడు కొంతమంది ఇలాంటి పనులు చేస్తుంటారు. అలాగే ఏ పనీ లేక బోర్ కొట్టినప్పుడు కూడా టైమ్ పాస్ కోసం ఈ పని చేస్తుంటారు.
దీనివల్ల వచ్చే ముప్పు
మన చేతుల మీద రకరకాల క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. ముక్కులో వేలు పెట్టినప్పుడు అవి సులభంగా లోపలికి వెళ్లి అనారోగ్యానికి గురిచేస్తాయి. అదే చేత్తో వేరే వస్తువులు ముట్టుకుంటే ఆ క్రిములు ఇతరులకు కూడా పాకుతాయి.
ఈ అలవాటును ఎలా మానుకోవాలి
కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఈ అలవాటుకు గుడ్ బై చెప్పొచ్చు. ముక్కు లోపల పొడిబారకుండా ఉండటానికి మెడికల్ షాపుల్లో దొరికే సెలైన్ నాసల్ స్ప్రే వాడొచ్చు. ఇది ముక్కును తేమగా ఉంచుతుంది. ఒంట్లో వాటర్ కంటెంట్ తగ్గకుండా చూసుకుంటే ముక్కు లోపలి చర్మం డ్రై అవ్వదు.
ఇంట్లో, ముఖ్యంగా ఏసీ వాడుతున్నప్పుడు గాలిలో తేమ తగ్గకుండా హ్యూమిడిఫైయర్ వాడటం మంచిది. ముక్కులో నిరంతరం దురద పెడుతుంటే డాక్టర్‌ని సంప్రదించి అలర్జీకి మందులు వాడండి.
బోర్ కొట్టినప్పుడో, టెన్షన్ వచ్చినప్పుడో ముక్కు వైపు చేతులు వెళ్తుంటే.. స్ట్రెస్ బాల్స్ నొక్కడం లేదా చేతులతో వేరే ఏదైనా పని చేయడం ద్వారా ఈ అలవాటును పక్కన పెట్టొచ్చు.
చివరాగాముక్కును క్లీన్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడూ వేళ్లు వాడకండి. బాత్రూమ్‌కి వెళ్లి నీళ్లతో శుభ్రం చేసుకోవడం లేదా సాఫ్ట్ కర్చీఫ్, టిష్యూ పేపర్ వాడటం అత్యంత సురక్షితమైన పద్ధతి!
