ప్లూవిక్టో పేరుతో లాంచ్ చేసిన నొవార్టిస్
న్యూఢిల్లీ: క్యాన్సర్ రోగుల కోసం ఫార్మా సంస్థ నొవార్టిస్ ఇండియా సోమవారం ఒక కొత్త చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల చికిత్స కోసం అత్యంత కచ్చితత్వంతో పనిచేసే రేడియోథెరపీ ‘ప్లూవిక్టో’ ను భారత్‌లో లాంచ్ చేసింది. ప్రోస్టేట్ స్పెసిఫిక్ మెంబరేన్ యాంటిజెన్ (పీఎస్‌ఎంఏ)–పాజిటివ్ ప్రోస్టేట్ క్యాన్సర్ రోగుల కోసం తీసుకొచ్చిన ఈ చికిత్స, ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆమోదం పొందింది.
ఈ చికిత్స శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలకు ఎలాంటి హాని చేయకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తుంది. ఇది శరీరమంతటా వ్యాపించిన ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులకు సాయపడనుంది. నొవార్టిస్ ఇండియా కంట్రీ ప్రెసిడెంట్ అమితాబ్ దూబే మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన కొన్ని ప్రముఖ ఆసుపత్రులు, న్యూక్లియర్ మెడిసిన్ సెంటర్ల ద్వారా ఈ 'ప్లూవిక్టో' థెరపీని రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
