ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‎కు మరో దెబ్బ.. దాయాది దేశానికి ఐసీసీ భారీ జరిమానా

ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‎కు మరో దెబ్బ.. దాయాది దేశానికి ఐసీసీ భారీ జరిమానా

లండన్: పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా జూన్ 14న ఇండియాతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా పాకిస్థాన్‎కు జరిమానా విధించింది ఐసీసీ. మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధించింది. ఫాతిమా సనా నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినట్లుగా తేలడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ రిఫరీ ట్రూడీ జరిమానా విధించారు. మెగా టోర్నీ ఆరంభ మ్యాచులోనే ఇండియా చేతిలో ఘోర ఓటమి చవిచూసిన బాధలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు జరిమానా రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..

 మహిళల టీ20 వరల్డ్ కప్‎లో మెన్ ఇన్ బ్లూ జట్టు ఊహించినట్లుగానే పాకిస్తాన్‎పై ఘన విజయం సాధించి టోర్నీని గ్రాండ్‏గా స్టార్ట్ చేసింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల భారీ టార్గెట్‎తో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు.. భారత స్పిన్ మ్యాజిక్ తట్టుకోలేక కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 64 పరుగుల భారీ తేడాతో పాక్‎ను మట్టికరిపించి టోర్నీలో బోణీ కొట్టింది.

5 వికెట్లతో చెలరేగిన దీప్తి శర్మ:

171 రన్స్ చేజింగ్లో పాకిస్తాన్ ఓపెనర్లు ఆరంభంలో కాస్త దూకుడుగా ఆడినప్పటికీ, భారత స్పిన్నర్ దీప్తి శర్మ బంతిని చేతిలోకి తీసుకున్నాక మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. పక్కా లైన్ అండ్ లెంగ్త్ పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన దీప్తి.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి పాక్ నడుం విరిచింది. ఆమెకు తోడుగా శ్రీచరణి 3 వికెట్లు తీయడం, భారతి ఫుల్మాలి సూపర్ రనౌట్ తో మునీబా అలీ (41) ని అవుట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ 106 పరుగులకే కుప్పకూలింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా డకౌట్ కాగా, నటాలియా (7) తో పాటు మిగతా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

మంధాన, రిచా ఘోష్ ధమాకా!

ఈ మ్యాచ్‎లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ మొదటి బంతికే సిక్స్ కొట్టి అవుట్ అవ్వడం, జెమీమా (1) నిరాశపరచడంతో తొలి ఐదు ఓవర్లలో స్వల్ప ఒత్తిడి నెలకొంది. కానీ, ఆ తర్వాత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లాస్ బ్యాటింగ్‎తో చెలరేగి హాఫ్ సెంచరీ (68 రన్స్) తో జట్టును ఆదుకుంది. 

►ALSO READ | 32 మ్యాచ్‌లు, 8 జట్లు.. ఇదే TG20 లీగ్ షెడ్యూల్.. జూన్ 21 నుంచి ఉప్పల్‌లో మ్యాచులు!

కెప్టెన్ హర్మన్ ప్రీత్ (36) తో కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక చివర్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ పాక్ బౌలర్లను ఉతికి ఆరేసింది. ముఖ్యంగా 19వ ఓవర్లోనే 23 పరుగులు పిండుకుని కేవలం 17 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లి 34 రన్స్ చేయడంతో భారత్ 20 ఓవర్లలో 170 పరుగుల భారీ స్కోరు సాధించింది.