టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో నాగచైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యలు ఆమెను మానసికంగా ఎంతో కుంగతీశాయి. ఈ సమస్యలను నుంచి బయటపడి ఇప్పుడు తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత, తనలో వచ్చిన మార్పుల గురించి సమంత లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
వెలుగు నింపిన రాజ్..
2021లో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తను పూర్తిగా మారిపోయానని సమంత అంగీకరించారు. విడాకుల తర్వాత నన్ను నేను పూర్తిగా బంధించుకున్నాను. మళ్ళీ జీవితంలో ఎవరినైనా నమ్ముతానని , వేరొకరిపై డిపెన్డ్ అవుతానని నేను అస్సలు ఊహించలేదు. నా హృదయంలో మరొకరికి చోటు లేదనుకున్నాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తలెత్తిన మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు మరింత కృంగదీశాయి. అయితే, ఆ బాధాకరమైన దశ నుండి బయటపడటానికి సమయం పట్టిందని, రాజ్ నిడిమోరు పరిచయం తన జీవితంలో వెలుగు నింపిందని తెలిపారు.
ALSO READ : టాలీవుడ్‌లో పెళ్లి సంబరాలు షురూ..
నేనిప్పుడు నటించడం లేదు
సమంత జీవితంలో వచ్చిన మార్పును ఆమె స్నేహితులు కూడా గమనించారు. చాలా కాలం తర్వాత నువ్వు ఊపిరి తీసుకోవడానికి కష్టపడటం లేదు అనిపిస్తోంది అంటూ ఒక స్నేహితురాలు పంపిన వాయిస్ నోట్ తనను కదిలించిందని సమంత చెప్పారు. గతంలో ప్రతిక్షణం ఒక మాస్క్ ధరించి, అందరి కోసం సంతోషంగా ఉన్నట్లు నటించేదాన్నని, కానీ ఇప్పుడు రాజ్‌తో ఉన్న బంధం వల్ల తాను మరింత మెరుగైన వ్యక్తిగా మారానని ఆమె పేర్కొన్నారు.
ప్రొఫెషనల్ టు పర్సనల్
సమంత- రాజ్ ల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' షూటింగ్ సమయంలో మొదలైంది. ఆ తర్వాత 'సిటాడెల్: హనీ బన్నీ' కోసం మళ్ళీ కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే వీరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. గతేడాది 2025, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఎటువంటి ఆడంబరాలు లేకుండా జరిగిన ఈ పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
కెరీర్ లో బిజీగా..
ప్రస్తుతం సమంత తన తదుపరి చిత్రం 'మా ఇంటి బంగారం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సమంత సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' నిర్మిస్తోంది. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు కూడా సహ నిర్మాతగా, రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ఎన్నో కష్టాలను, అనారోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న సమంత, ఇప్పుడు తన జీవితంలో ప్రశాంతతను వెతుక్కున్నారు..
