కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కేరళ రాష్ట్రం పేరు మారింది.. ఇకపై కేరళం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కేరళ రాష్ట్రం పేరు మారింది.. ఇకపై కేరళం

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 14 ఏళ్ల బాలికులకు ఉచితంగా గర్దాసిల్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

అహ్మదాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జబల్‌పూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు పచ్చ జెండా ఊపింది.

కేరళ రాష్ట్రం పేరు ఎందుకు మార్చారంటే..
2024లోనే కేరళ పేరును కేరళంగా మార్చే సవరణ బిల్లుకు కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు కేంద్రం ఆమోదం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూసింది. తాజాగా కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలపడంతో కేరళ పేరు కేరళంగా మారింది. గతంలో ఈ బిల్లును కేంద్రానికి పంపగా దిద్దుబాట్లను ఎత్తి చూపుతూ తిరిగి పంపించింది. అనంతరం.. కేరళ అసెంబ్లీ కొత్త తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం కేంద్రానికి పంపింది. 

రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ ప్రకారం.. కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చడానికి తొలుత 2023 ఆగస్టు 9న కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని తీర్మానంలో కేంద్రాన్ని కోరింది. అదే విధంగా ఎనిమిదో షెడ్యూల్‌ ప్రకారం.. అన్ని భాషల్లో పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు. అయితే అన్నీ పరిశీలించిన అనంతరం.. అటువంటి సవరణ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మాత్రమే ఉందని కేరళ ప్రభుత్వం గుర్తించింది.

అందుకే కొత్త తీర్మానం చేసి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత.. కేంద్రానికి ఈ బిల్లును పంపింది. మలయాళంలో 'కేరళం' అనే పేరు వాడుకలో ఉందని కేరళ సీఎం పినరయి ఆ తీర్మానంలో తెలిపారు. అధికారిక రికార్డుల్లో మాత్రమే ఆ రాష్ట్రాన్ని 'కేరళ' అని పిలుస్తున్నారని కేరళ సీఎం గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఇకపై అధికారిక రికార్డుల్లో కూడా 'కేరళం' అని మాత్రమే ఉంటుంది.