బెంగళూరు సిటీలో మనం రోజూ తినే కూరగాయల గురించి ఒక భయంకరమైన విషయం బయటపడింది. అక్కడ అమ్మే కూరగాయల్లో మనుషులకు హాని చేసే 'సీసం' (Lead), ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) తేల్చింది.
'ఆర్గానిక్' పేరుతో ఎక్కువ ధర పెట్టి కొనే కూరగాయలు కూడా కలుషితమయ్యాయని నివేదిక చెబుతోంది. సేంద్రీయ వంకాయల్లో ఉండాల్సిన దానికంటే 20 రెట్లు ఎక్కువగా సీసం ఉన్నట్లు గుర్తించారు. ఇక దొండకాయల్లో 18 రెట్లు, చిక్కుడుకాయల్లో 9 రెట్లు ఎక్కువగా సీసం ఉంది. ఆకుకూరలు, క్యాబేజీ, దోసకాయ, బీట్‌రూట్, కాకరకాయ, మిరపకాయల్లో కూడా పరిమితికి మించి విషపూరిత అంశాలు ఉన్నాయి.
కేవలం కూరగాయలే కాదు, అవి పండే మట్టి కూడా విషపూరితమైపోయింది. పరీక్షించిన 26 మట్టి నమూనాల్లో 23 కలుషితమైనవే. దీనివల్ల రాబోయే కాలంలో పండే పంటల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది.
ఈ అధ్యయనంలో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రభుత్వం నిషేధించిన మోనోక్రోటోఫోస్ వంటి అత్యంత విషపూరితమైన పురుగుమందులను ఇంకా వాడుతున్నారు. యూరప్ దేశాల్లో ఎప్పుడో బ్యాన్ చేసిన అసిఫేట్, ఫిప్రోనిల్ వంటి రసాయనాలు కూడా మన కూరగాయల్లో కనిపిస్తున్నాయి. ఇవి మెదడు, నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
►ALSO READ | వీడేం మనిషి.. 25 ఏళ్ల తర్వాత తిరిగొస్తే.. తల్లివే కాదు పొమ్మంటాడా?
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు.. నెలమంగళ, రాజాజీనగర్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాంతాల్లోని మార్కెట్లు, పొలాల నుండి ఈ నమూనాలను సేకరించి పరీక్షించారు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని, పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండొచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, రైతులకు అవగాహన కల్పించాలని అలాగే ఆహార భద్రతను కఠినంగా పర్యవేక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బెంగళూరు కూరగాయలలో సీసం కాలుష్యం:
ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు (FSSR) ప్రకారం చాలా కూరగాయలలో సీసం అనుమతించదగిన పరిమితి 0.1 నుండి 0.3 mg/kg మధ్య ఉంటుంది. కానీ మనం తినే కూరగాయల్లో ఉండాల్సిన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా విషపూరిత సీసం ఉందో ఈ వివరాలు చూస్తే అర్థమవుతుంది.
సేంద్రియ వంకాయలో 1.953 mg/kg, ఉండాల్సిన పరిమితి 0.1 mg/kg, ఎన్ని రెట్లు ఎక్కువ అంటే 20 రెట్లు
దొండకాయలో కూడా ఉండాల్సిన మోతాదు 0.1 mg/kgకి మించి 18 రెట్లు ఎక్కువగా ఉంది.
చిక్కుడు కాయలో 1.825 mg/kg, ఉండాల్సిన పరిమితి 0.2 mg/kg, అంటే 9 రెట్లు అధికం.
ఆకు కూరల్లో ఉండాల్సిన మోతాదు 0.3 mg/kg కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంది.
క్యాబేజీలో కూడా ఉండాల్సిన మోతాదు 0.3 mg/kgకి మించి 5 రెట్లు అధికంగా ఉంది.
కేవలం వీటిలోనే కాకుండా ప్రతిరోజు చేసే వంటల్లో వాడే కూరగాయలు బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, దోసకాయ, బీట్‌రూట్, ఎర్ర ముల్లంగి, క్యాప్సికం, బజ్జీలు చేసే మిర్చిలో ప్రమాదకరమైన రసాయనాలు, సీసం ఉన్నట్లు గుర్తించారు.
