ఎంతైనా కన్నతల్లి కన్నతల్లే.. ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా చూసుకోవాల్సింది కడుపున పుట్టినవారే.. కన్నతల్లి బంధం కన్నా గొప్పది ఏదీ లేదు.. అలాంటిది 25ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తల్లిని ఓ కొడుకు కాదు పొమ్మన్నాడు.. నువ్వు నా తల్లివేకాదు అని ఇంట్లోకి రానిచ్చేందుకు నిరాకరించాడు. హృదయ విదారక ఘటనకు సంబంధించి ఫుల్ డిటెయిల్స్..
సుశీల ముర్ము.. జార్ఖండ్ లోని గొడ్డి జిల్లా కు చెందిన 75 యేళ్ల వృద్ధ మహిళ.. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లిందో గానీ.. ఎలా వెళ్లిందో తెలియదు గానీ 25 ఏళ్ల క్రితం సొంత గ్రామం నుంచి కనిపించకుండాపోయింది. 25 ఏళ్ళ లపాటు కోల్ కతాలో ఓ క్రైస్తవ మిషనరీ స్వచ్చంద సంస్థలో తలదాచుకుంది. ముర్ము 2001 నుంచి దక్షిణ కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ షెల్టర్ హోమ్ లో ఆశ్రయం పొందగా దాదాపు మతిస్థిమితం లేని స్థితిలో షెల్టర్ హోం లో చేరిన ముర్ముకు వారు అందించిన సేవలతో తిరిగి మామూలు మనిషి అయింది.
ఏళ్లు గడిచాయి. ఆశ్రమమే ఆమె నివాసం అయింది. క్రిస్టియన్ గా బతుకుతోంది. తరుచు తన భర్త, కొడుకు గురించి మాట్లాడేది..ఆమె కోల్ కతాలకు ఎలా వచ్చిందో గుర్తించలేకపోయింది.. అయితే తన భర్త హిందూ రైతు అని, తనకు కొడుకున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యుల విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించింది. తన సొంతగ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా తనకు కొడుకు ఉన్నాడని తెలుసుకుంది. కొడుకును చేరుకునేందుకు సొంతగ్రామానికి వచ్చింది. అక్కడే ఆమెకు బాధకరమైన ఘటన ఎదురైంది.
కన్న తల్లి.. 25 ఏళ్ల తర్వాత కంటపడింది.. అక్కున చేర్చుకోవాల్సిన కొడుకు మదన్ బెస్రా ఆమెను కాదు పొమ్మన్నాడు. నువ్వు మతం మార్చుకున్నావు.. హిందువుగా తిరిగి మారితేనే నేనే అమ్మగా చూసుకుంటానన్నాడు. దీంతో దిక్కు తోచని ముసలి తల్లి బోరున విలపించింది. కన్న కొడుకు కాదనడంతో పెట్టెడు దుఖంతో తిరిగి కోల్ కతాలోని ఆశ్రమానికి వెళ్లిపోయింది.
