రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 2025, డిసెంబర్ 18వ తేదీన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయన్నారు. కేం ద్రంలోని మోడీ ప్రభుత్వం కపాస్ యాప్ పెట్టి పత్తి రైతులను ముంచిందని.. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ సర్కారు కూడా మ్యాపులు, యాప్స్ పేరిట రైతుల ఉసురు పోసుకుంటున్నదన్నా రు.
కేసీఆర్ హయాంలో యూరియాకు కొరత ఉండేది కాదని.. కాంగ్రెస్ వచ్చాక కష్టాలు మొదలయ్యాయని అన్నారు. రుణమాఫీ చేస్తానని సీఎం దుర్గమ్మ మీద, ఎసయ్య మీద ప్రమాణం చేసి ఇవ్వలేదని గుర్తు చేశారు. పంట కొనుగోలులో సర్కారు విఫలమైందన్నారు హరీశ్ రావు. రైతులకు ఇవ్వాల్సిన యాసంగి, వానాకాలం బోనస్ రూ. 1,800 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన.
పంట వేసినోళ్లకే రైతు బంధు ఇస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల లీకులు ఇస్తున్నారని.. యాసంగిలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన. రేవంత్ సర్కారు వచ్చాక బస్ చార్జీలు రెండింతలు పెరిగాయన్న హరీశ్ రావు.. రుణమాఫీ కాని రైతులకు వెంటనే డబ్బులు చేయాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా ఘనపురం ఆయకట్టు కింద రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సింగూరు మరమ్మతుల పేరిట రైతులను గందరగోళం లోకి నెట్టారని అన్నారు. సింగూరు ప్రాజెక్టుపై మెదక్, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి హక్కుందన్నారు. సింగూరు నుంచి మూడు విడుతల్లో నీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు.
