మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాడి ఘటనపై స్పందించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కావాలనే బీఆర్ఎస్ నాయకులు మాపై ఉద్దేశ్య పూర్వకంగా దాడులు చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడిలో ఒక కానిస్టేబుల్‌కు తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయని.. అలాగే కాంగ్రెస్ కార్యకర్త కూడా గాయపడ్డారని తెలిపారు.
శుక్రవారం చెన్నూరులో మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ఎన్నికను అడ్డుకుంటున్నానని నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఓటు వేసే హక్కును బాల్క సుమన్ హరించారని.. ఈ సారి ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ప్రజా పాలనను నడిపించామన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించలేదని చెప్పారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకుని బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారని ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ ట్రాఫిక్ కోన్‌ను మా కార్లపై విసిరాడని.. కావాలనే మాపై ఉద్దేశ్యపూరితంగా దాడులు చేశారని అన్నారు. నేను ఎప్పుడు వయిలెన్స్ను ప్రోత్సహించనన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల దాడిలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతోనే బాల్క సుమన్‌ను అరెస్ట్ చేశారని.. కానీ ఇందులో నా పాత్ర ఉందని బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన బాల్క సుమన్ ఒక ఎమ్మెల్యేపై స్వయంగా దాడి చేయడం సిగ్గు చేటన్నారు. హరీష్ రావు, కేటీఆర్ జైలుకు వెళ్లి సుమన్ పరామర్శిస్తున్నారు.. అంటే వారు దాడులను ప్రోత్సహిస్తున్నారనే అర్ధమన్నారు. చట్టవ్యతిరేక పనులు ఎవరూ చేసిన చట్టం తన పని తాను చూసుకుంటుందని పేర్కొన్నారు.
