The Kerala Story 2: 'ద కేరళ స్టోరీ 2' విడుదలకు గ్రీన్ సిగ్నల్.. స్టే ఎత్తివేస్తూ హైకోర్టు కీలక తీర్పు!

The Kerala Story 2: 'ద కేరళ స్టోరీ 2' విడుదలకు గ్రీన్ సిగ్నల్.. స్టే ఎత్తివేస్తూ హైకోర్టు కీలక తీర్పు!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చిత్రం 'ద కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' (The Kerala Story 2: Goes Beyond) . విడుదలకు ముందే  ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి.  చివరకు కేరళ హై కోర్టుకు చేరింది.  దీంతో కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర స్టేను  కేరళ హైకోర్టు శుక్రవారం ( ఫిబ్రవరి 27 ) ఎత్తివేసింది. దీంతో ఈ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. 

కోర్టులో అసలేం జరిగింది?

నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 27న (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బెచు కురియన్ థామస్, గురువారం  ( ఫిబ్రవరి 26న )  ఈ సినిమా విడుదలపై 15 రోజుల స్టే విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. సెన్సార్ బోర్డు (CBFC) నిబంధనలను పాటించలేదని, సినిమాపై వచ్చిన అభ్యంతరాలను మరోసారి పరిశీలించాలని కోర్టు ఆదేశించింది.

దీనిని సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్, గురువారం రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక విచారణ (Special Sitting) చేపట్టింది. సుమారు రెండు గంటల పాటు వాదోపవాదాలు సాగిన తర్వాత, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

హైకోర్టు కీలక తీర్పు

శుక్రవారం తీర్పు వెలువరించిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను కొట్టివేసింది. సెన్సార్ బోర్డు ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి తగిన ఆధారాలు లేవని భావిస్తూ, సినిమా విడుదలకు మార్గం సుగమం చేసింది. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.

సినిమా చుట్టూ వివాదం ఎందుకు?

'ద కేరళ స్టోరీ' మొదటి భాగం ఎంతటి వివాదాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెండో భాగం 'గోస్ బియాండ్' పేరుతో మరింత తీవ్రమైన అంశాలను చిత్రీకరించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.  కేరళతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, మత మార్పిడిలు, తీవ్రవాద సంస్థల కార్యకలాపాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని సమాచారం. ఈ సినిమాకు 'U/A' సర్టిఫికేట్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు, కొన్ని మతపరమైన సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

ఈరోజే విడుదలవుతుందా?

కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చినప్పటికీ, సినిమా ఈరోజే విడుదలవుతుందా లేదా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. శుక్రవారం సాయంత్రం తీర్పు రావడం వల్ల, థియేటర్ల సర్దుబాటు, కంటెంట్ డెలివరీలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తవచ్చు. నిర్మాతలు త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.. రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.