చెన్నై: టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ (55), హార్ధిక్ పాండ్యా (50) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. చివర్లో తిలక్ వర్మ (44) మెరుపులు మెరుపులు మెరిపించడంతో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా.
గురువారం (ఫిబ్రవరి 26) చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (33) రాణించారు. భారీ చేధనలో ఓవర్లన్నీ ఆడిన జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. యువ ఓపెనర్ బెన్నెట్ (97) చివరి వరకు పోరాడినప్పటికీ జింబాబ్వే 72 రన్స్ తేడాతో భారీ ఓటమి చవిచూసింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
వచ్చినోళ్లు వచ్చినట్లే వీర బాదుడు:
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్లో సౌతాఫ్రికాపై ఓటమి పాలై కసి మీదున్న భారత బ్యాటర్ల జింబాబ్వేపై రెచ్చిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు వచ్చినోళ్లు వచ్చినట్లే దంచికొట్టారు. రింకు స్థానంలో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ (24) ధనాధన్ ఇన్సింగ్స్ ఆడాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతోన్న స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55, 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కంబ్యాక్ ఇచ్చాడు.
ఇక ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఇషాన్ (38) కూడా క్రీజులో ఉన్నంత సేఫు పరుగుల వర్షం కురిపించాడు. ఇక, స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు.
స్కై కేవలం 13 బంతుల్లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 33 రన్స్ చేసి ఔట్ కాగా.. తిలక్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 రన్స్ చేశాడు. ఇక, చివర్లో స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది హాష్ సెంచరీతో పూర్తి చేసుకున్నాడు. చివర్లో తిలక్, పాండ్యా శివాలెత్తి ఆడటంతో టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే టీమిండియా తమ తొలి అత్యధిక స్కోర్ (256) నమోదు చేసింది.
బెన్నెట్ ఒంటరి పోరాటం:
257 పరుగుల భారీ లక్ష్యంతో ఛేధన మొదలుపెట్టిన జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు ఓపెనర్ బెన్నెట్ (97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రజా (31) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు మొదట్లో వికెట్లు తీయకున్నా పరుగులు రాకుండా కట్టడి చేశారు.
దీంతో చేయాల్సిన పరుగులు బంతులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరగడంతో జింబాబ్వే బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది. వేగంగా ఆడే క్రమంలో చివర్లో వెంటనే వెంటనే జింబాబ్వే వికెట్లు కోల్పో్యింది. భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
